Share News

Former Minister Harish Rao: రేవంత్‌ ఢిల్లీలో ఉంటూ పాలన గాలికొదిలేశారు

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:59 AM

తెలంగాణలోకన్నా.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు..

Former Minister Harish Rao: రేవంత్‌ ఢిల్లీలో ఉంటూ పాలన గాలికొదిలేశారు

  • ఏసీడీపీ నిధులివ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

  • గ్రామపాలనను ప్రభుత్వం నాశనం చేస్తోంది

  • పండగపూట చార్జీలు పెంచి దండుకోవడం సిగ్గుచేటు: హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోకన్నా.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యేల ఎసీడీపీ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్ర భుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. సర్కారు చర్యలతో నియోజకవర్గాల్లో అభివృద్ధి పను లు పూర్తిగా నిలిచిపోయాయని శుక్రవారం ఎక్స్‌వేదికగా ఆయన పేర్కొన్నారు. ‘గ్రామపాలనను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. నిధుల్లేక పంచాయతీలు అవస్థలు పడుతున్నాయి. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేరు. డీజిల్‌కు డబ్బుల్లేక పంచాయతీ ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పండుగ పూట వీధిదీపాలు వెలగక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. పండుగ వస్తే చాలు ఆర్టీసీ చార్జీలను అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డివిరిచేందుకు సిద్ధంకావడం సిగ్గుచేటు. బతుకమ్మ, దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై పెనుభారం మోపుతూ పండుగ సంబరం కూడా లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్‌ బోర్డులు తగిలించిచేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది’ అని హరీశ్‌ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.

80 టీఎంసీల నీళ్లకోసం 35 వేల కోట్లు ఖర్చుపెడతారా?

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రూ.35 వేల కోట్లు ఖర్చుపెట్టి, 4.47 లక్షల ఎకరాలకే సాగునీరందించగలమని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. కేవలం 80 టీఎంసీల నీటి కోసం అంత ఖర్చు చేయడం అనాలోచిత చర్యగా ఆయన అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడోవంతు ఖర్చుచేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లివ్వలేని అనాలోచితచర్య కాంగ్రెస్‌ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిదర్శనమని విమర్శించారు.

Updated Date - Sep 20 , 2025 | 04:59 AM