Share News

Former Minister Harish Rao: విద్యార్థులకు అన్నం పెట్టలేని సీఎంను కొరడాతో కొట్టి, తొండలు జొర్రించాలి!

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:30 AM

విద్యార్థులకు కనీసం అన్నం పెట్టలేని సీఎం రేవంత్‌ రెడ్డిని చెట్టుకు కట్టేసి.. కొరడా దెబ్బలు కొట్టి లాగుల తొండలు జొర్రించినా తక్కువేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు..

Former Minister Harish Rao: విద్యార్థులకు అన్నం పెట్టలేని సీఎంను కొరడాతో కొట్టి, తొండలు జొర్రించాలి!

  • పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

  • మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

సిద్దిపేట కల్చరల్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు కనీసం అన్నం పెట్టలేని సీఎం రేవంత్‌ రెడ్డిని చెట్టుకు కట్టేసి.. కొరడా దెబ్బలు కొట్టి లాగుల తొండలు జొర్రించినా తక్కువేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్‌ రెడ్డి.. విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు, మెస్‌ బిల్లులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. చిల్లర మాటలు మానుకొని విద్యార్థుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట నాసర్‌పురలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలోని విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం హరీశ్‌ రావు బ్లాంకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే కోడిగుడ్లు, బియ్యంను పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. తర్వాత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఐదు నెలలుగా విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు, మెస్‌ బిల్లులు రావడం లేదని, కొందరు ఉపాధ్యాయులు సొంత డబ్బుతో విద్యార్థుల అవసరాలు తీరుస్తున్నారని చెప్పారు. సీఎం వద్దే విద్యా శాఖ ఉన్నప్పటికీ ఎందుకు బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని ప్రశ్నించారు. గ్రీన్‌ చానల్‌ ద్వారా డబ్బు ఇస్తామన్న మాటలేమయ్యాయని నిలదీశారు. కమీషన్‌ ఇచ్చే వాళ్లకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నారని, విద్యార్థులు కమీషన్‌ ఇవ్వలేరు కాబట్టే వారి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికేదైనా చెప్పాలనుకుంటే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్‌ మాట్లాడితే ఆయనపై వీధి రౌడీలాగా ఎగబడుతున్నారని, తండ్రిలాంటి కేసీఆర్‌ పట్ల అలా మాట్లాడటం సరికాదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే రేవంత్‌ రెడ్డి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ గెలుస్తానని రేవంత్‌ శపథాలు చేస్తున్నారన్నారు. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్‌ రెడ్డి చిత్తుగా ఓడిపోయినాఎందుకు సన్యాసం తీసుకోలేదని గుర్తు చేశారు. చిల్లర మాటలు మాట్లాడటం, పార్టీలు మారడం, కమీషన్లు కొట్టుడు ఆయనకు బాగా అలవాటు అని ఎద్దేవా చేశారు.

Updated Date - Dec 26 , 2025 | 05:30 AM