Former Minister Harish Rao: నాడు ఉద్యమ ద్రోహి.. నేడు జలద్రోహి
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:50 AM
నాటి ఉద్యమ సమయంలోనే తుపాకులతో బెదిరించి ద్రోహిగా నిలబడ్డ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెలంగాణకు నష్టం కలిగించేలా జలద్రోహానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
గోదావరి నీళ్ల తరలింపుపై.. ఏపీకి మద్దతిస్తున్న సీఎం రేవంత్
నల్లమలసాగర్ నిర్మించినా రాష్ట్రానికి నష్టమే
దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నాటి ఉద్యమ సమయంలోనే తుపాకులతో బెదిరించి ద్రోహిగా నిలబడ్డ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెలంగాణకు నష్టం కలిగించేలా జలద్రోహానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం కలిగిస్తూ.. అక్రమంగా గోదావరి జలాలను తరలించుకొని వెళ్లేందుకు ఏపీ ప్రయత్నిస్తుంటే.. అడ్డుకోవాల్సిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి దొడ్డిదారిన మద్దతునివ్వడం దుర్మార్గమన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే.. తెలంగాణకు కలిగే ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్‌ఎస్ అని.. మొదటి నుంచి దీని విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతూ వస్తున్నారని విమర్శించారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బనకచర్ల అంశమే చర్చకు రాలేదని బుకాయించారని, ఏపీ మంత్రి మీడియా ముందు చెప్పాక.. అసలు బండారం బయటపడిందన్నారు. ఆ సమావేశంలో తెలంగాణ సీఎం ఒప్పుకొన్న కారణంగానే, జూలై 31న గోదావరి వరద జలాల్లో 200 టీఎంసీల వరకు ఏపీ వినియోగించుకోవచ్చని.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కీలక అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇది జరిగి అయిదు నెలలైనా.. కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై పక్కరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తంచేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించ లేదన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడుగడుగునా అన్యాయమే చేస్తోందని ఆరోపించారు. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీలో ఆందోళను దిగాలని, బీఆర్‌ఎస్ పక్షాన తాము మద్దతుగా వస్తామని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి పోరాడింది బీఆర్‌ఎస్ అయితే.. తమ విజయంగా మంత్రి ఉత్తమ్ చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రాజెక్టును బనకచర్లకు బదులు నల్లమలసాగర్‌కు ఎందుకు మార్చారో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు. బనకచర్ల బదులు నల్లమలసాగర్ నిర్మించినా తెలంగాణకు నష్టమేనని పేర్కొన్నారు. ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేసేలా.. గోదావరి-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి బీఆర్‌ఎస్ పక్షాన పూర్తిమద్దతు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు చేయకుండా.. రాష్ట్ర రైతాంగానికి ప్రయోజనం కలిగేలా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఎవరి ప్రయోజనం కోసం ఆదిత్యనాథ్ దాస్ కమిటీ?
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటూ సుప్రీం కోర్టులో కేసు వేశామని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలని హరీశ్ రావు అన్నారు. ఈనెల 15న ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సంబంధించి కమిటీ వేస్తే.. 23న తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. ఇందులోనూ ఆంధ్రా మూలాలున్న ముగ్గురు వ్యక్తులున్నారని, గతంలో తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌తో ఈ కమిటీని ఎవరి ప్రయోజనం కోసం వేశారని ప్రశ్నించారు. తక్షణం ఈ కమిటీని రద్దుచేయాలని, అదేవిధంగా ఆదిత్యానాథ్ దాస్‌ను ప్రభుత్వ సలహాదారుగా తొలగించాలని డిమాండ్ చేశారు.