Former DSP Nalini: నవమిలోపు సమస్యను పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:05 AM
నవమిలోపు ప్రభుత్వం తన సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆ రోజు సజీవ సమాధి అవుతానని మాజీ డీఎస్పీ నళిని శుక్రవారం తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు....
లేదంటే ఆ రోజు సజీవ సమాధి అవుతా
మాజీ డీఎస్పీ నళిని తాజా లేఖ
హైదరాబాద్ ఆయుర్వేద ఆస్పత్రిలో చేరిక
హైదరాబాద్, భువనగిరి టౌన్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నవమిలోపు ప్రభుత్వం తన సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆ రోజు సజీవ సమాధి అవుతానని మాజీ డీఎస్పీ నళిని శుక్రవారం తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో చేరారు. మరణ వాంగ్మూలం పేరిట ఇటీవల ఆమె రాసిన లేఖ చర్చనీయాంశం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి కలెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, తాజాగా శుక్రవారం ఆమె పెట్టిన పోస్టులో తన ఆరోగ్యం మరింత దిగజారిపోతోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన విషయం పట్టించుకోవడం లేదని, తన మరణ వాంగ్మూలాన్ని ఆర్డీవోతో రికార్డు చేయించడం తప్ప మరే చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య సినిమా హాల్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని వారం రోజుల్లోనే ఆదుకున్నారని, తన విషయంలో ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ అధికారిని అయినా సస్పెండ్ చేస్తే ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని, విచారణ సమయంలో మూడో వంతు జీతం జీవనభృతి కింద ఇవ్వాలని, అలా ఇవ్వకపోవడం నేరం కిందకు వస్తుందన్నారు. కాని తన విషయంలో సస్పెన్షన్ తర్వాత తనకు రావాల్సిన డబ్బు విషయంలో సీఎం రేవంత్‌కు దరఖాస్తు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు. తన సమస్యకు సీఎం పరిష్కారం చూపకపోతే మరణమే శరణ్యమని పేర్కొన్నారు.