Konda Lakshma Reddy Passes Away: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:31 AM
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి(85) కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన సమస్యతో బాధపడుతున్న లక్ష్మారెడ్డి..
ఎన్‌ఎస్ఎస్ వ్యవస్థాపకుడు
ప్రముఖుల నివాళి.. సీఎం రేవంత్ సంతాపం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి(85) కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన సమస్యతో బాధపడుతున్న లక్ష్మారెడ్డి.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మారెడి స్వస్థలం మొయినాబాద్ జిల్లా పెద్ద మంగళారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డికి మనవడు అవుతారు. పాత్రికేయ వృత్తిపై అభిలాషతో లక్ష్మారెడ్డి న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్(ఎన్‌ఎ్‌సఎ్‌స) వార్తా ఏజెన్సీని 1980లో ప్రారంభించారు. చివరి వరకు దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగారు. రాజకీయాల్లో అడుగు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం నుంచి 1983లో పోటీ చేసి గెలిచారు. తర్వాత 1999, 2004 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధిగా, గ్రీవెన్స్ సెల్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ క్రీడా మండలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లకు అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మారెడ్డి భౌతికకాయాన్ని సోమవారం పలువురు రాజకీయ, పాత్రికేయ రంగాల ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలె యాదయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఏఐసీసీ పరిశీలకుడు రాబర్ట్ బ్రూస్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, వయోధిక పాత్రికేయ సంఘం ప్రతినిధులు భండారు శ్రీనివాసరావు, మాజీ సీపీఆర్వో వనం జ్వాలానరసింహారావుతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల స్పీకర్ ప్రసాద్‌కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కొండా లక్ష్మారెడ్డికి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు నల్లగొండ జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత గురునాథ్‌రెడ్డి పెద్ద కుమార్తె సరళ కాగా, మరో భార్య పేరు అరుణ. లక్ష్మారెడ్డి-సరళ సంతానం విజిత్‌రెడ్డి, ప్రతిమ, అరుణ-లక్ష్మారెడ్డి పిల్లలు శైలేందర్ రెడ్డి, సుష్మ. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో లక్ష్మారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి.