Foreign Universities Show Interest in Telangana: రాష్ట్రంలోనే విదేశీ విద్య!
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:38 AM
ఉన్నత విద్యాభ్యాసం కోసం దేశం నుంచి ఏటా 4.5 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారని ఓ అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య కూడా అధికమే...
ఆఫ్‌లైన్ క్యాంప్‌సల ఏర్పాటుకు 5-6 వర్సిటీల ఆసక్తి
అనుమతులు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
కేంద్ర ప్రభుత్వంతోనూ సమాలోచనలు
లండన్‌లోని ఓ ప్రముఖ వర్సిటీకి ‘పైగా’ ప్యాలెస్‌లేదా న్యాక్ భవనాన్ని ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కారు
14 విదేశీ యూనివర్సిటీలకు యూజీసీ అనుమతులు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాభ్యాసం కోసం దేశం నుంచి ఏటా 4.5 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారని ఓ అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య కూడా అధికమే. అయితే, రానున్న రోజుల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లాల్సిన పని లేకుండా ఆయా వర్సిటీలతో ఇక్కడే ఆఫ్‌లైన్ క్యాంప్‌సలను ఏర్పాటు చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, కెనడా వంటి దేశాల్లోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలతో సంప్రదింపులు జరుపుతోంది. వీటిలో ఐదారు యూనివర్సిటీలు ఇక్కడ క్యాంప్‌సల ఏర్పాటుకు ఆసక్తి కనబర్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆఫ్‌లైన్ క్యాంప్‌సల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలుజరుపుతున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. లండన్‌కు చెందిన 2-3 వర్సిటీలు రాష్ట్రంలో ఆఫ్‌లైన్ క్యాంప్‌సల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇందులో ఓ ప్రముఖ యూనివర్సిటీకి హైదరాబాద్‌లో ఉన్న ‘పైగా’ ప్యాలెస్ లేదా హైటెక్స్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) భవనాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
విదేశీ విద్యకు రూ.లక్షల్లో ఖర్చు
డిమాండ్ ఉన్న కోర్సులను బోధిస్తారని, అక్కడ చదివితే త్వరగా ఉద్యోగం వస్తుందన్న ఆశతో విదేశాల్లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20లక్షల దాకా ఆర్థిక సాయం అందిస్తోంది. కానీ, కొన్నేళ్లుగా పరిస్థితులు అంత ఆశాజనకంగా ఏమీ లేవు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు, మూడేళ్లుగా ఇతర దేశాలకు వెళ్లి చదువు పూర్తయి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య వేలల్లో ఉండడమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఆయా వర్సిటీలు అందిస్తున్న విద్యను అదే స్థాయి ప్రమాణాలతో ఇక్కడే అందుబాటులోకి తెస్తే యువత మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ఫీజుల భారం తగ్గడంతోపాటు ప్రయాణ ప్రయాసలు తగ్గుతాయని అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే ఇతర దేశాల నుంచి భారత్‌కు రావాలనుకునే వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో సర్కారు ప్రణాళికలను రచిస్తోంది. ఇటీవల పలు దేశాలకు చెందిన ప్రతినిధులు సీఎం రేవంత్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన సమయంలోనూ ఆయా దేశాల్లోని వర్సిటీల ఆఫ్‌లైన్ క్యాంప్‌సలను ఇక్కడ ఏర్పాటు చేయడంపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.
ఇప్పటికే 14 వర్సిటీలకు అనుమతి
విదేశాలకు చెందిన పలు యూనివర్సిటీలు భారత్‌లో తమ క్యాంప్‌సలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా వాటికి పచ్చజెండా ఊపుతోంది. విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా దాదాపు 14 వర్సిటీలకు వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. ఇందులో 5-6 వర్సిటీలు.. ఆఫ్‌లైన్ క్యాంప్‌సల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. విదేశాల నుంచి భారత్‌కు రానున్న వర్సిటీలు గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గుజరాత్‌లో క్యాంప్‌సలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. వీటిలో ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్, వోల్లోంగాంగ్ వర్సిటీలు అహ్మదాబాద్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్)లో ఇప్పటికే తరగతులు ప్రారంభించాయి. అలాగే, యూకే, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా దేశాలకు చెందిన పలు వర్సిటీలు భారత్‌కు రానున్నాయి. వీటిలో కొన్నింటిని రాష్ట్రానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.