Foreign MBBS Graduates Face Internship: ఇక్కడ ఇంటర్ చదవకుంటేఇంటర్న్‌షిప్ కట్!
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:05 AM
ఆమె పేరు.. బోరుసు ఇందిరా మణిశ్రీ. ఊరు ఖమ్మం. ఒకటి నుంచి పదో తరగతి వరకూ సొంతూరిలో.. ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివి...
విదేశాల్లో వైద్య విద్య చదివిన మెడికోల కష్టాలు
వైద్య విద్య ప్రవేశాల నిబంధనలనే వారికి కూడా అమలు చేస్తామని చెబుతున్న రాష్ట్ర వైద్య మండలి
వైద్య మండలి ముందు అలాంటివారి పడిగాపులు
తొలుత వారి దరఖాస్తులు స్వీకరించేందుకూ నో
తర్వాత.. 7వ తేదీ వరకూ తీసుకునేందుకు సిద్ధం
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆమె పేరు.. బోరుసు ఇందిరా మణిశ్రీ. ఊరు ఖమ్మం. ఒకటి నుంచి పదో తరగతి వరకూ సొంతూరిలో.. ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివి, నీట్ రాశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఈ) నిర్వహించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఏడాది పాటు ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. కానీ.. అందుకు తెలంగాణలో 9నుంచి 12 వరకు చదివిన వారికే అవకాశం ఇస్తామని రాష్ట్ర వైద్యమండలి స్పష్టం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారామె. ఖమ్మం జిల్లాకే చెందిన మరో విద్యార్థి అవదూర్తి శరత్ చంద్రది కూడా అదే పరిస్థితి. ఒకటి నుంచి పది వరకు తెలంగాణలో, ఇంటర్ విజయవాడలో చదివిన ఆయన.. వైద్యవిద్యను ఫిలిప్పీన్‌లో పూర్తి చేశారు. ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేద్దామంటే.. ఇంటర్ ఇక్కడ చదవలేదు కాబట్టి నాన్ లోకల్ అంటున్నారని వాపోయారు. ఇది వారిద్దరి సమస్య మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ విద్యార్థుల్లో చాలామంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. వైద్యవిద్య ప్రవేశాల కోసం రూపొందించిన నియమ నిబంధనలను వీరి విషయంలోనూ అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ప్రకటించడంతో.. ఎఫ్‌ఎంజీలంతా (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేస్తేనే..
విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన వారు మన దేశంలో వైద్యం చేయాలంటే ముందుగా ఎఫ్‌ఎంజీఈ రాయాలి. మొత్తం 300 మార్కులకు పెట్టే ఈ పరీక్షలో కనీసం 150 సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు. ఎన్‌బీఈ ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ పరీక్షలో వందకు కేవలం 18.61 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఏటా ఇది 20-25 శాతం మధ్య ఉంటుందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించిన వారు ఏడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎఫ్‌ఎంజీలు తమ తమ రాష్ట్రాల్లోని వైద్య మండళ్లకు దరఖాస్తు చేసుకోవాలి. అలా వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి, కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా ఇంటర్న్‌షిప్ ఇస్తారు. అలా తమకు కేటాయించిన ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తేనే వారి వైద్యపట్టాను రిజిస్టర్‌చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తెలంగాణవ్యాప్తంగా 34 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎఫ్‌ఎంజీలకు ఇంటర్న్‌షిప్ కేటాయించి.. వారికి నెలకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్ ఇస్తున్నారు. అదే.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేసిన వారికైతే స్టైపెండ్‌గా రూ.29,792 చెల్లిస్తున్నారు. గతంలో ఇది రూ. 25,906గా ఉండేది. రాష్ట్ర సర్కారు 2024 జూన్ 28న స్టైఫండ్‌ను పెంచింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఇక్కడ ఇంటర్న్స్‌గా పనిచేస్తున్నవారికి కూడా తప్పనిసరిగా స్టైపెండ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2023లో నిర్ణయించి, ఆ మేరకు జీవో జారీ చేసింది. దాంతో నామమాత్రంగా రూ.5 వేలు ఇస్తున్నారని.. తమిళనాడు లాంటి చోట్ల ఎఫ్‌ఎంజీలకు స్లైపెండ్ చెల్లించట్లేదని అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తులు తీసుకోలే..
ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎఫ్‌ఎంజీలు సోమవారం కోఠిలోని రాష్ట్ర వైద్యమండలి కార్యాలయానికి వచ్చారు. కానీ.. 9 నుంచి 12 వరకు తెలంగాణలో చదివిన విద్యార్ధుల దరఖాస్తులనే తీసుకున్నారని.. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ చదవని వారి అప్లికేషన్లను తీసుకోలేదని పలువురు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆందోళన వెలిబుచ్చారు.. తమ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని వేడుకున్నా.. వైద్యమండలి అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి రాష్ట్ర వైద్యమండలి దృష్టికి తీసుకెళ్లగా.. 7వ తేదీ దాకా ఈ తరహా దరఖాస్తులు తీసుకుంటామని మండలి స్పష్టతనిచ్చింది. ఇటువంటి విద్యార్ధుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని వైద్యవిద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారో (1 నుంచి 7వ తరగతి వరకు రాష్ట్రంలో విద్య) అలాంటి పద్ధతినే ఎఫ్‌ఎంజీల విషయంలోనూ పాటించాలని వారు పేర్కొంటున్నారు.
లోకల్స్‌కు ఇచ్చాక మిగిలితేనే మాకు ఇస్తారట!
తొమ్మిదోతరగతి నుంచి 12వ తరగతి వరకూ ఇక్కడ చదివిన వారికే ఇంటర్న్‌షిప్ కేటాయింపుల్లో తొలుత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వైద్య మండలి అధికారులు చెబుతున్నారు. అలా చేస్తే మెరిట్‌తో సంబంధం లేకుండా కేటాయింపులన్నీ అటువంటి విద్యార్ధులతోనే పూర్తవుతాయి. ఇంటర్ ఇక్కడ చదవని మా పిల్లలకు ఇంటర్న్‌షిప్ దక్కడం కష్టం. ఇది అన్యాయం. వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను దీంట్లోనూ అమలు చేస్తామనడం దారుణం. దీనిపై ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ దృష్టిసారించి మాకు న్యాయం చేయాలి.
-ఒక బాధిత విద్యార్థి తండ్రి
వైద్యవిద్య ప్రవేశాల నిబంధనల మేరకే..
కిందటి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 425 ఇంటర్నిషిప్ వేకెన్సీలున్నాయి. ఈ ఏడాది ఇంతవరకూ వైద్య విద్య డైరెక్టర్ కార్యాలయం ఇంటర్న్‌షిప్ సంఖ్య వివరాలను రాష్ట్ర వైద్యమండలికి ఇవ్వలేదు. డిసెంబరు 7 తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభిస్తాం. వివాదాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే.. ఇంటర్న్‌షి్‌పకు కూడా వైద్య విద్య నిబంధనలనే పాటిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన వారి దరఖాస్తులను కూడా తీసుకుంటాం. ఆ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఇంటర్న్‌షిప్ ప్లేసులను కేటాయిస్తాం.
- డాక్టర్ గుండగాని శ్రీనివాస్,
వైస్ చైర్మన్, రాష్ట్ర వైద్యమండలి