ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - May 28 , 2025 | 12:32 AM
భూగర్భజలాలు అందక బోర్లు ఎండిపోయిన రైతులు వర్షాభావ పరిస్థితుల సమయాల్లో రైతులు ఒకే వరి పంట సాగుపై ఆధారపడకుండా అధిక దిగుబడులందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిని సారించాలని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు.
చిట్యాలరూరల్, మే 27 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలాలు అందక బోర్లు ఎండిపోయిన రైతులు వర్షాభావ పరిస్థితుల సమయాల్లో రైతులు ఒకే వరి పంట సాగుపై ఆధారపడకుండా అధిక దిగుబడులందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిని సారించాలని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. ఆరెగూడెం, సుంకెనపల్లి, ఉరుమడ్ల, చిన్నకాపర్తి గ్రామాల్లో మంగళవారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. దిగుబడులు రాక ఆందోళన చెందే రైతులు మారుతున్న పరిస్థితులకనుగుణంగా తక్కువ నీటి సామర్ధ్యంతో సాగుచేసుకునేందుకు ఎన్నో పంటలున్నాయని కంది, జోన్న, వేరుశనగ, ఆముదము, ప్రొద్దుతిరుగుడు, తృణధాన్యాల వంటి పంటలు వేసుకుని వర్షాభావ పరిస్థితుల నుంచి బయట పడాలన్నారు. సదస్సులో ఏఈఓలు వీణాకుమారి, కృష్ణకుమారి, వాసుదేవ్, మనీషా, శశాంక పాల్గొన్నారు.
మర్రిగూడ,: వరి, పత్తి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల ద్వారా భూసారం పెంచుకోవచ్చనని మునుగోడు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు మర్రిగూడ మండల స్పెషల్ అధికారి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం మర్రిగూడ రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటలు, పంటల మార్పిడిపై అవగాన సదస్సు నిర్వహించారు. రైతులు పంటలు మార్పిడి ద్వారా భూసారం పెంచుకోవడంతో పాటు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈసందర్భంగా రైతులు ఫార్మర్ రిజస్ర్టీ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి సహాస్, వ్యవసాయ విస్తరణాధికారులు పి.విజయ్ కుమార్, జి.సుజాత, శ్రీలత, నాగస్వాతి, అరుణ రైతులు పాల్గొనడం జరిగింది.
సన్న రకం వరిని సాగు చేయాలి
కనగల్ : రైతులు సన్న రకం వరి సాగును చేపట్టాలని ఏవో అమరేందర్‌గౌడ్ సూచించారు. పర్వతగిరి గ్రామంలో పంటల మార్పిడి సాగుపై రైతులకు మంగళవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సన్న రకం వరి దాన్యానికి ప్రభుత్వం రూ.500ల బోనస్‌ను చెల్లిస్తుందన్నారు. రైతులు ఎప్పటికప్పుడు పంటల మార్పిడిని చేయాలన్నారు. అంతర పంటగా. కందిని సాగు చేస్తే భూసారం పెరుగునన్నారు. తద్వారా పంటల ఉత్పత్తి పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూమి అనుకూలతను బట్టి పంటలు సాగు చేయాలి
కేతేపల్లి, మే 27(ఆంధ్రజ్యోతి): భూమి అనుకూలతను బట్టి పంటలు సాగు చేయడం రైతులకు లాభదాయకమని మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం సూచించారు. పంట మార్పిడి విధానంపై మండలంలోని ఇనుపాముల, కేతేపల్లి, కొప్పోలు గ్రామాల్లో రైతులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న వరి, పత్తి, పంటల స్థానంలో ఆయా భూముల అనుకూలత మేరకు కంది, ఆకు కూరలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి పంటలు పండించే దిశగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇలా పంట మార్పిడి విధానంతో భూసారం పరిరక్షించబడుతుందన్నారు. పత్తి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దళారుల మాటలకు మోసపోయి నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు బాలరాజు, ఉమేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.