Sriramnagar Basti Floods: నీళ్లలో బస్తీ
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:36 AM
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి భారీ వర్షానికి ఆ బస్తీని వరద ముంచెత్తింది. బస్తీలోని 200 ఇళ్లలో నాలుగైదు ఫీట్ల మేర వరద నీరు నిలిచింది.
శ్రీరాంనగర్ బస్తీలో ఐదు అడుగుల మేర నీళ్లు
రూ.లక్ష చొప్పున నష్టం.. వరదలో మునిగిన 50 బైక్‌లు
నాలా పైప్‌లైన్ మూసివేత వల్లే సమస్య
పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశాలు
హైదరాబాద్‌లో పగలంతా ఎండ.. సాయంత్రానికి వర్షం
మరో మూడు రోజుల పాటు వర్షాలు
రాంనగర్, అమీర్‌పేట, అప్జల్‌గంజ్, హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో బుధవారం రాత్రి భారీ వర్షానికి ఆ బస్తీని వరద ముంచెత్తింది. బస్తీలోని 200 ఇళ్లలో నాలుగైదు ఫీట్ల మేర వరద నీరు నిలిచింది. మోటార్లు పెట్టి అదేపనిగా తోడుతున్నా ఆ వరద తగ్గడం లేదు. ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు.. లోపలి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితీ లేదు. ఫలితంగా బస్తీవాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. బియ్యం, పప్పులు సహా నిత్యావసర సరుకులు పాడైపోవడంతో పస్తులుంటున్నారు. కనీసం తాగేందుకూ నీళ్లు లేక దాహంతో అలమటిస్తున్నారు. విద్యుత్తు సరఫరా లేక అక్కడి జనాలు చీకట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గృహోపకరణాలూ పనికిరాకుండాపోయాయి. వంట సరుకులు పాడైపోవడం, గృహోపకరణాలు దెబ్బతినడంతో ఇంటికి రూ.లక్ష చొప్పున నష్టం జరిగింది. ఇదంతా రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ బస్తీ పరిస్థితి! ఆ బస్తీ అంతా ఇప్పుడు చెరువును తలపిస్తోంది. ఇళ్లలో వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషన్ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం తెల్లవారుజామున శ్రీరాంనగర్ బస్తీకి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యేక మోటార్లను ఏర్పాటు చేసి నీటిని బయటకు పంప్ చేశారు. సాయంత్రం దాకా 20శాతం నీరు కూడా బయటకు పోలేదు. ఫలితంగా 24 గంటలు గడిచినా అక్కడి ప్రజలు వరదలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరి.. బస్తీలో ఎందుకీ సమస్య ఉత్పన్నమైనట్లు? దీనిపైనే కమిషనర్ రంగనాథ్ ఆరాతీస్తే.. ఇదంతా ఓ ప్రైవేటు వ్యక్తి నిర్వాక ఫలితమని తేలింది.
ఈ బస్తీది దాదాపు వందేళ్ల చరిత్ర. బస్తీలో వాన నీరు సమీపంలోని హుస్సేన్‌సాగర్ నాలాలోకి వెళ్లేందుకు 50 ఏళ్ల క్రితం ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ స్థలం తనదంటూ ఓ వ్యక్తి ఆ పైప్‌లైన్‌ను బ్లాక్ చేశాడు. ఫలితంగా బయటకు వెళ్లే పరిస్థితి లేక వరద నీరంతా బస్తీలోనే జామ్ అవుతోంది. వర్షంపడ్డ ప్రతిసారి జీహెచ్‌ఎంసీ అధికారులు మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. బస్తీ పరిస్థితిపై స్పందించిన రంగనాథ్, శ్రీరాంనగర్ నుంచి హుస్సేన్‌సాగర్ నాలా వరకు ఉన్న పైప్‌లైన్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని, తద్వారా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌ను బ్లాక్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందించిన ఇంజనీరింగ్ అఽధికారులు స్పందించి జేసీబీని రప్పించి పాత పైప్‌లైన్ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కాగా రంగనాథ్... నగరం వ్యాప్తంగా పలు ముంపు ప్రాంతాల్లోనూ పర్యటించి పరిస్థితులపై ఆరా తీశారు.
మళ్లీ వర్షం
హైదరాబాద్‌ను వాన వదలడం లేదు. గురువారం నగర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడింది. మధ్యాహ్నం 3:30 వరకు ఎండ దంచికొట్టింది. ఆ తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం 4.30 నుంచి 5.15 వర్షం పడింది. పాతబస్తీలోని గౌలిపురా హనుమాన్‌నగర్‌లో, ఛత్రినాక శివగంగ నగర్‌లో, పంజాగుట్ట మోడల్ హౌస్‌వద్ద, పంజాగుట్ట మసీద్ వద్ద, ఖైరతాబాద్, అమీర్‌పేట్ మెట్రోస్టేషన్లు, బల్కంపేట్ సబ్‌వేలు నీట మునిగాయి బంజారాహిల్స్ రోడ్డు నంబరు-12 పోలీసు కమాండ్ కంట్రోల్ రూం వద్ద పెద్ద ఎత్తున నీరు నిలవడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. బహదూర్‌పురా మండలంలోని చందూలాల్ బారాదారిలో 8.6 సెం.మీ, దూద్‌బౌళిలో 8.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు మళ్లీ ఓపెన్ చేశారు. హిమాయత్‌సాగర్ నీటిమట్టం 1762 అడుగులకు, ఉస్మాన్‌సాగర్ నీటిమట్టం 1789 అడుగులకు చేరుకుంది. జంట జలశాలయాల నుంచి నీళ్లను వదులుతుండటంతో అంబర్‌పేట్‌లోని ముసారాంబాగ్ బ్రిడ్జిపై ట్రాఫిక్ పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 9.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా రానున్న రెండు, మూడు రోజులపాటు హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
విషాదాలు..
బల్కంపేట నుంచి బేగంపేటకు వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద వరద నీటిలో మునిగి మహ్మద్ షరీఫుద్దీన్ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. అతడు ముషీరాబాద్ సమీపంలోని భోలక్‌పూర్‌లో ఉంటున్నాడు. కూకట్‌పల్లిలో కృత్రిమ అవయవాలు తయారుచేసే కర్మాగారంలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 9:30కు కర్మాగరం నుంచి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. బల్కంపేట అండర్ బ్రిడ్జి కింద వరదలో బైక్ చిక్కుకుపోవడంతో బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ఉధృతి పెరగడంతో అతడూ నీళ్లలో మునిగిపోతూ హాహాకారాలు చేశాడు. రక్షించేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. హైడ్రా సిబ్బంది వచ్చి.. చాలాసేపు ప్రయత్నించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య సల్మా, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. ఈనెల 14న హబీబ్‌నగర్ నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరు మామా అల్లుళ్లలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు నల్లగొండ జిల్లా వలిగొండ సమీపంలోని మూసీ వద్ద గురువారం అల్లుడు అర్జున్ మృతదేహం లభించింది. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.