Former minister Harish Rao: వరద బాధితులకు సాయమేదీ?
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:51 AM
రాష్ట్రంలో వరద బాదితులకు సహాయం అందించడంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు...
కామారెడ్డిలో ముఖ్యమంత్రి పర్యటించినా నయా పైసా సహాయం అందలేదు
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కేంద్రం నుంచి నిధులు తేలేకపోతున్నారు
మాజీ మంత్రి హరీశ్‌రావు
నాగిరెడ్డిపేట, గాంధారి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద బాదితులకు సహాయం అందించడంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి నెల రోజులు గడుస్తున్నా బాధితులకు నయా పైసా కూడా సహాయం అందలేదన్నారు. హరీశ్‌రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో మంజీరా వరద ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వరదలతో కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వందలాది ఇళ్లు కూలిపోయాయన్నారు. జిల్లా అధికారులు సర్వే చేసి వరదల వల్ల రూ.344 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా 34 రూపాయలు కూడా జిల్లాకు విడుదల కాలేదని విమర్శించారు. బాధిత రైతులకు తక్షణమే ఎకరాకు రూ.25 వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సైతం జిల్లావైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. జిల్లాలో కోతకు గురైన రోడ్లు, గండ్లు పడిన కాల్వలు, చెరువుల మరమ్మతు పనులను కూడా ప్రారంభించలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్‌లో భూముల ధరలు తగ్గాయి కానీ మద్యం ధరలు, ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తే హామీలపై నిలదీయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఎక్కడైనా బీఆర్‌ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, అది పేదల పార్టీ కాదని, ధనవంతుల పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు కేంద్ర నిధులు తేవడం లేదని ప్రశ్నించారు. రైల్వే ప్రాజెక్టులకు సహా తెలంగాణకు నిధుల కేటాయింపులో మోదీ సర్కారు వివక్ష చూపుతున్నా రేవంత్ ప్రభుత్వం గట్టిగా నిలదీయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.