kumaram bheem asifabad- ముంచెత్తిన ప్రాణహిత వరద
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:08 PM
ప్రాణహిత నదికి మరోసారి వరద పోటెత్తడంతో తీర ప్రాంతాల్లోని పత్తి పంట వరద నీటిలో మునిగిపోయింది. మండల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది మహారాష్ట్రలోని ఎగెవ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నదికి భారీగా బ్యాక్ వాటర్ రావడంతో పంట పొలాల్లోకి నీరు చేరింది. దీంతో రైతులు సాగు చేస్తున్న పత్తి పంట మరోసారి నీట మునగడంతో తీర ప్రాంత రైతులకు తీరని నష్టం మిగిల్చింది
బెజ్జూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత నదికి మరోసారి వరద పోటెత్తడంతో తీర ప్రాంతాల్లోని పత్తి పంట వరద నీటిలో మునిగిపోయింది. మండల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది మహారాష్ట్రలోని ఎగెవ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నదికి భారీగా బ్యాక్ వాటర్ రావడంతో పంట పొలాల్లోకి నీరు చేరింది. దీంతో రైతులు సాగు చేస్తున్న పత్తి పంట మరోసారి నీట మునగడంతో తీర ప్రాంత రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ఇప్పటికే ప్రాణహిత నదికి వరద రూపంలో పత్తి పంటను ముంచెత్తగా మరోసారి వచ్చిన వరద కారణంగా రైతుల కష్టం కన్నీటి పాలు కావడంతో లబోదిబో మంటున్నారు. సాగు కోసం ఇప్పటికే లక్షల రూపాయల పెట్టుబడి రూపంలో ప్రాణహిత నది పత్తి పంట తుడిచి పెట్టుకు పోవడంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ వాటర్ కారణంగా తలాయి, పాపన్నపేట, గ్రామాల మధ్య రాక పోకలు స్తంభించి పోయాయి.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణమిత నది నిండుకుండలా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని కురిసిన భారీ వర్షాలకు వార్దా, పెన్‌గంగా కలయికతో ఏర్పడిన ప్రాణహిత ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత పుష్కర ఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. మరో నాలుగు మెట్లను తాకితే పుష్కర ఘాట్ పూర్తిగా మునిగి పోతుంది. ప్రాణహిత నిండుకుండలా ప్రవహిస్తూ ఉండడంతో సందర్శకులు నది అందాలను వీక్షిస్తున్నారు. ప్రాణహిత, వార్దా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మళ్లీ ఉప్పొంగిన పెన్‌గంగా
సిర్పూర్(టి), ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి, వెంకట్రావుపేట సమీపంలో పెన్‌గంగా ఉధృతంగా ప్రవహించింది. వంతెన పైనుంచి నీరు ప్రవహించడంతో రాక పోకలు నిలిచి పోయాయి. వంతెనల సమీపంలో ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు నిర్వహించారు.