Share News

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు..ముందుకొచ్చిన ఐదు సంస్థలు

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:38 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి ఐదు...

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు..ముందుకొచ్చిన ఐదు సంస్థలు

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి ఐదు సంస్థలు టెక్నికల్‌ బిడ్లు దాఖలు చేశాయి. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను కోరుతూ నోటీసు ఇవ్వగా.. ఐదు సంస్థలు టెక్నికల్‌ బిడ్లు వేశాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు బిడ్ల దాఖలుకు గడువు పూర్తయింది. దాంతో అధికారులు బిడ్లను తెరిచారు. ఇందులో ఆర్వీ అసోసియేట్స్‌, ఐఐటీ చెన్నయ్‌, స్పెయిన్‌కు చెందిన సంస్థ కలిపి జాయింట్‌ వెంచర్‌గా బిడ్‌ వేశాయి. ఆ తర్వాత నిప్పాన్‌ సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసింది. మొత్తం ఐదు సంస్థలు బిడ్లు వేయడంతో వాటిని పరిశీలించిన అనంతరం షార్ట్‌లిస్ట్‌ చేసి, ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించనున్నారు. ఆ తర్వాత టెక్నికల్‌ బిడ్లలో అర్హత సాధించిన సంస్థల నుంచి ఫైనాన్షియల్‌ బిడ్ల దాఖలు కోరుతూ టెండర్‌ నోటీసు ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ తుది నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు అందించాలని ప్రభుత్వం కోరిన విషయం విదితమే. బ్యారేజీ పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్‌ రివ్యూ, వరదలు/భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బ్యారేజీల సామర్థ్యంపై మదింపు, గేట్లు/పియర్లు/స్టిలింగ్‌ బేసిన్‌/కటాఫ్‌ వాల్స్‌ వంటి బ్యారేజీలోని కీలక విభాగాలను పటిష్టం చేసేందుకు డిజైన్లు అందించడం వంటి సేవలను అందించాలని ఈవోఐలో గుర్తుచేసింది. బ్యారేజీల ప్రస్తుత డిజైన్లతో పాటు ఎన్‌డీఎ్‌సఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని, ఈ క్రమంలో అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి జియో టెక్నికల్‌, జియో ఫిజికల్‌ వంటి పరీక్షలను పరిశీలించాలని, ఈ పరీక్షల ద్వారా బ్యారేజీల్లో అన్ని రకాల లోపాలను గుర్తించాలని కోరింది. ఎన్‌డీఎ్‌సఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకును పటిష్టం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది. దాంతో ఈ షరతులన్నిటికి స్పందిస్తూ ఐదు సంస్థలు టెక్నికల్‌ బిడ్లు దాఖలు చేయడంతో అధికారులు తదుపరి అడుగులు వేయనున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 04:38 AM