Panchayat Elections: నేడే తొలి విడత పల్లె పోరు
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:02 AM
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నేడు (గురువారం) నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్...
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నేడు (గురువారం) నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్‌ఈసీ) రాణి కుముదిని తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. బుధవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏడీజీపీ మహేశ్ భగవత్, పీఆర్ డైరెక్టర్ సృజన, ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరంద్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 395 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. 3,834 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. మిగిలిన 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవటంతో పోలింగ్ జరగటం లేదు. అదేవిధంగా 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది పోటీపడుతున్నట్లు వివరించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. సాయంత్రంలోపే ఉప సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేస్తామని తెలిపారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ.7,54,78,535 విలువైన వస్తువులు, నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో రూ.1.70 కోట్ల నగదు, రూ.2.84 కోట్ల విలువైన మద్యం, రూ.2.22 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.64.15 లక్షల విలువైన ఇతర వస్తువులు ఉన్నాయని వివరించారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన 3,214 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 31,428 మంది పోలీసుల సమక్షంలో బైండోవర్ అయినట్లు వివరించారు.
ఓటర్ల కోసం ‘టీ పోల్’ యాప్..!
గ్రామీణ ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం టీ పోల్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని రాణి కుముదిని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చని చెప్పారు. ఎన్నిలకు సంబంధించి పౌరులు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్: 92400 21456ను సంప్రదించాలని సూచించారు.
పల్లె బాట పట్టిన ప్రజలు
పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఆయా ప్రాంతాల ప్రజలు గ్రామాల బాట పట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్‌బీనగర్, అఫ్జల్‌గంజ్, ఆరాంఘర్ వంటి ప్రధాన బస్టాండ్లు బుధవారం కిటకిటలాడాయి. బస్సుల్లో సీట్ల కోసం ఫీట్లు చేయాల్సి వచ్చింది. చాలా బస్సుల్లో సీట్లు దొరక్క నిల్చునే ప్రయాణం చేశారు. కొన్ని రూట్లలో ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది. అవి కూడా చాలక ప్రజలు ప్రైవేటు వాహనాల్లో సొంత గ్రామాలకు వెళ్లారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఓటర్ల కోసం సొంతంగా వాహనాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుంచి అన్ని రూట్లలో అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
537 ఫ్లయింగ్ స్క్వాడ్స్: డీజీపీ
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టామని డీ జీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో 537 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆయుధాలతో సిద్ధంగా ఉంటారని, 155 సర్వేలెన్స్ బృందాలను రంగంలో దింపామని బుధవారం వెల్లడించారు. 54 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 1,053 నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ చేసినట్లు వెల్లడించారు.