వైటీపీఎస్‌లో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:27 AM
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమ(వైటీపీఎస్) లోని యూనిట్-1లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
దామరచర్ల, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమ(వైటీపీఎస్) లోని యూనిట్-1లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమలోని యూనిట్-2ను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, యూనిట్-1ను ఈ ఏడాది మే నెలలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్-1లో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరిగేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బాయిలర్‌కు ఆయిల్ సరఫరా అవుతున్న క్రమంలో పైపులైన్‌కు ఏర్పాటు చేసిన గ్యాస్ కట్ వద్ద లీకేజీ జరిగింది. అట్టి లీకేజ్ అయిన ఆయిల్ దిగువన ఉన్న వేడి మెటీరియల్‌పై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో అప్రమత్తమైన ఉద్యోగులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 30మీటర్ల ఎత్తులోని కేబుల్, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు సమాచారం. ఆదివారం సెలవు దినం కావడంతో సంఘటన జరిగిన ప్రాంతంలో కార్మికులు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం సంభవించడంతో ట్రయల్ రన్ పనులు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ విషయమై పరిశ్రమలోని అధికారులకు సంప్రదించగా ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతాయని వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చామని వారు చెప్పుకొచ్చారు. పరిశ్రమలోని యూనిట్-1లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అదికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతు పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
ప్రమాదంపై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమలో యూనిట్-1 పనుల్లో ఆయిల్ లీకేజీతో అగ్ని ప్రమాదం సంభవించిన నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, బీహెచ్‌ఈఎల్ సీఎండీ సదాశివమూర్తిలతో కలిసి ఆయన వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ అధికారులు పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో యూనిట్-1లోని పనులు పునఃప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించినట్లు జెన్‌కో చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.