Share News

Former Sarpanches: అయ్యో..సర్పంచ్‌ సాబ్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:16 AM

సర్పంచ్‌గిరి కోసం నువ్వానేనా అన్నట్టు గట్టి పోటీ నెలకొన్నా ఆ పదవి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందమేనని అనిపిస్తోంది. పదవికి ఎన్నికయ్యాక గ్రామపెద్దగా గౌరవమర్యాదలు, హోదా పెరుగుతాయి.

Former Sarpanches: అయ్యో..సర్పంచ్‌ సాబ్‌

  • సొంత డబ్బులతో అభివృద్ధి పనులు

  • బిల్లులు రాక రూ.లక్షల్లో అప్పులు

  • భూములు అమ్ముకొని ఇల్లు గుల్ల

  • పొట్టకూటి కోసం ఉన్న ఊర్లోనే కూలీలుగా కొందరు

  • ఉపాధి కోసం హైదరాబాద్‌ బాట

  • వేతనం రూ.6,500 మాత్రమే.. ఎన్నిక కోసం లక్షల్లో ఖర్చు

  • అన్నీ తెలిసినా సర్పంచ్‌ పదవికి

  • సై.. నేనంటే నేనంటూ పోటీ

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన తాజా మాజీ సర్పంచ్‌ పాల వెంకటరెడ్డి ఊర్లో అభివృద్ధి పనులకు కోసం భారీగా అప్పులు చేశారు. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల మేర బకాయిలు రాకపోవడంతో అప్పులు తీర్చేందుకు తన ఏడెకరాలను అమ్ముకున్నారు. ఇదే మండలం మర్లపాడు తాజా మాజీ సర్పంచ్‌ వేణుగోపాలరెడ్డికి రూ. 20 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. అప్పులు తీర్చేందుకు వేణుగోపాల్‌ రెండెకరాలు అమ్ముకొని సత్తుపల్లి వచ్చి వాటర్‌ బాటిళ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. మెదక్‌ జల్లా చేగుంట మండలం చెట్లతిమ్మాయిపల్లి సర్పంచ్‌గా పనిచేసిన స్వాతి అప్పులపాలై కూలి పనులకు వెళుతున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం తాటికొండ తాజా మాజీ సాయికుమార్‌ రూ.35 లక్షల మేర అప్పు చేసి గ్రామ పంచాయితీ భవనం, సీసీరోడ్లు నిర్మించారు. బిల్లులు రాక కొత్తగా కట్టుకున్న ఇల్లు, కారు అమ్ముకొని అప్పులు తీర్చేసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడెంకు చెందిన నరసింహులు గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. భార్య రేణుక సర్పంచ్‌గా ఎన్నికయ్యాక ఆ కొలువు వదిలేశారు. ఐదేళ్లలో అప్పులు చేసి ఊర్లో అభివృద్ధి పనులు చేయించారు. ఆ అప్పులు తీర్చేందుకు ఎకరం పొలం విక్రయించారు. గద్వాల జిల్లా సోంపురం తాజా మాజీ తిక్కన్న 100 గొర్రెలు అమ్మేసి అప్పులు చెల్లించారు.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సర్పంచ్‌గిరి కోసం నువ్వానేనా అన్నట్టు గట్టి పోటీ నెలకొన్నా ఆ పదవి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందమేనని అనిపిస్తోంది. పదవికి ఎన్నికయ్యాక గ్రామపెద్దగా గౌరవమర్యాదలు, హోదా పెరుగుతాయి. అంతా.. ‘సర్పంచ్‌ సాబ్‌’ అని పిలుస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపే! పదవి చేపట్టిన కొన్నాళ్లకే మోతుబరులు కాస్తా బికారులవుతున్నారు.


ఇస్త్రీ ఖద్దరు చొక్కా, జేబులో ఎప్పుడూ నాలుగు పెద్దనోట్లతో ఠీవీగా కనిపించిన సర్పంచ్‌ సాబులు పదవి చేపట్టిన రెండేళ్లకే కళతప్పుతున్నారు. ఆదర్శాలతోనో, వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడం ద్వారానో, అధికార పార్టీ పెద్దల ఒత్తిడితోనో అభివృద్ధి పనులన్నీ భుజానెత్తుకొని అప్పులు చేసి మరీ పూర్తిచేశారు. ఆ పనుల తాలూకు బిల్లులు రాకపోవడంతో ఆస్తులు తెగనమ్ముకొని వీధిన పడ్డారు. గత పంచాయితీ ఎన్నికల్లో గెలిచి.. తాజాగా మాజీలైన సర్పంచ్‌ల్లో ఎంతోమంది లక్షల్లో అప్పులపాలై ఆర్థికంగా చితికిపోయారు. కొందరు ఇళ్లు, భూములు అమ్ముకొన్నారు. అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆస్తులన్నీ కోల్పోయి పుట్టి పెరిగిన ఊర్లో ఉండలేక భార్యాపిల్లలతో వలస పోయిన వారూ ఉన్నారు. తాజాగా సర్పంచ్‌ ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డ తర్వాత రూ.లక్షల్లో పెండింగ్‌లో ఉన్న తమ బిల్లుల గురించి పట్టించుకునేవారెవరని మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు.


ఆ మహిళా సర్పంచ్‌ టైలర్‌ షాపులో పనికి..

అభివృద్ధి పనుల తాలూకు అప్పులు తీర్చేందుకు రెండు ప్లాట్లు అమ్మానని, ఏడు తులాల బంగారం తాకట్టు పెట్టానని రంగారెడ్డి జిల్లా ఎక్వాయిపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు హైదరాబాద్‌ వెళ్లామని.. భర్త సాయిలు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటే, తాను ఓ టైలర్‌ షాపులో పనిచేస్తున్నానని సుగుణ చెప్పారు పాలమూరు జిల్లా పూజారి తండా తాజా మాజీ అంజీ అప్పులకు వడ్డీలు కట్టేందుకు కూలికి వెళుతున్నారు.

ప్లాట్లు అమ్మి తీర్చేశారు

గద్వాల జిల్లా సూల్తాన్‌పూర్‌ మాజీ సర్పంచ్‌కు రూ.ఏడు లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉంటే గద్వాలలో ఫ్లాట్‌ను అమ్మి తీర్చేశారు. గువ్వలదిన్నె మాజీ సర్పంచ్‌ మహాదేవి రమేశ్‌ ఎకరం తాకట్టుపెట్టి అప్పులు తీర్చారు. పాలమూరులోని కొండపల్లి మాజీ సర్పంచ్‌ మహేశ్వరమ్మ ఎకరం అమ్ముకొన్నారు. చౌడూరు సర్పంచ్‌ వెంకటయ్య రూ.18 లక్షల మేర బిల్లులు రాకపోవడంతో ఊరొదిలి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కేటిదొడ్డి మాజీ సర్పంచ్‌ పావని వీరేశ్‌ రూ.6 లక్షల మేర అప్పులకు వడ్డీలు కట్టలేక కూలి పనులకు వెళుతున్నారు. తాను అప్పులు తీర్చేందుకు మూడున్నర ఎకరాలను అమ్ముకున్నానని రంగారెడ్డి జిల్లా చిలుకమర్రి తాజా మాజీ సర్పంచ్‌ మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50 లక్షల నుంచి రూ.70లక్షల దాకా అప్పులు చేసినవారూ ఉన్నారు. తనకు సర్పంచ్‌ పదవి అంటే ముళ్ల కిరీటం అనిపిస్తోందని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ సర్పంచ్‌ సావిత్రి బాలరాజు పేర్కొన్నారు.

వేతనం కొంతే.. ఖర్చు మాత్రం కొండంత

1992కు ముందు సర్పంచ్‌లకు వేతనాలు ఉండేవి కావు. ఆ తర్వాత చిన్న గ్రామపంచాయితీల సర్పంచ్‌లకు రూ.600 చొప్పున, మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌లకు రూ.1000 చొప్పున ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో వేతనాన్ని రూ.5వేలు చేశారు. 2021లో రూ.6,500కు పెంచారు. గతంలో ఈ వేతనంతో సర్పంచ్‌లకు ఖర్చులైనా వెళ్లేవి. ఇప్పుడు.. ఎన్నికయ్యేందుకే లక్షల్లో పెట్టాల్సి వస్తోంది. అన్నీ తెలిసినా.. ఆస్తులు మ్ముకొనైనా సర్పంచ్‌గా గెలిచేందుకు అభ్యర్థులు పోటీ పడుతుండటం గమనార్హం.


బిల్లులు రాక ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశెగూడెం షేక్‌ ఆజారుద్దీన్‌(27) సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధుల కింద రూ.15 లక్షలు ప్రకటించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని ఆయన భావించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. నిధులు విడుదల కాకపోగా పనుల విషయంలో అధికారుల ఒత్తిడి పెరిగింది. అప్పులు తీర్చేందుకు భార్య వెండి కడియాలు తాకట్టు పెట్టడంతో ఆలుమగల మధ్య గొడవలు జరిగాయి. మనస్తాపంతో అజారుద్దీన్‌ 2020 నవంబరు 12న ఆత్మహత్య చేసుకున్నారు.

భర్తతో కూలి పనులకు నీలిబాయి

గ్రామంలో అభివృ ద్ధి పనులు చేయించడంతో రూ 40లక్షల వరకు అప్పులయ్యాయి. రూ.25 లక్షల మేర బిల్లులు రావాల్సి ఉంది. అవి వస్తాయని ఆశిస్తే ఆలోపే బాద్యతల నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అరెకరం అమ్మితే రూ 10లక్షలొచ్చాయి. తాండూరులో 200 గజాల ప్లాటు అమ్మితే మరో రూ. 15లక్షలొచ్చాయి. కొంతమేర అప్పులు తీర్చి.. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు పోయాం. భార్యభర్తలం ఇప్పుడు కూలి పనులకు వెళుతున్నాం.

- నీలిబాయి, మాజీ సర్పంచ్‌,

బాద్లాపూర్‌తండా, రంగారెడ్డి జిల్లా

జీవితంలో మళ్లీ పోటీ చేయను

స్థాయికి మించి అప్పులు చేసి రూ.10లక్షలతో పాఠశాల భవనం నిర్మించాను. సీసీ రోడ్లు, గుళ్లు, గోపురా నిర్మాణాల కోసం లక్షల్లో ఖర్చుచేశాను. అప్పులకు వడ్డీలు పెరిగాయే తప్ప బిల్లులు రాలేదు. మూడున్నర ఎకరాలు అమ్మి అప్పులు తీర్చాను. రూ.20లక్షల బిల్లులు రావాల్సి ఉంది. వస్తే అవికూడా అప్పుల కిందకే జమవుతాయి. ఇక జన్మలో సర్పంచ్‌ పదవికి పోటీ చేయను.

- కంటె మాధవి, మాజీ సర్పంచ్‌,

చిలుకమర్రి గ్రామం, రంగారెడ్డి జిల్లా

Updated Date - Nov 30 , 2025 | 07:52 AM