Share News

Health Department Finances: వైద్య ఆరోగ్య శాఖకు ఆర్థిక సుస్తీ

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:09 AM

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆర్థిక సుస్తీ చేసింది. అత్యవసర శాఖకు ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేస్తోంది. ఈ శాఖలోని ఏ విభాగానికీ సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు...

Health Department Finances: వైద్య ఆరోగ్య శాఖకు ఆర్థిక సుస్తీ

  • అరకొర నిధులిస్తున్న ప్రభుత్వం

  • ఔషధ సరఫరాపై చేతులెత్తేసిన ఏజెన్సీలు

  • ఆరోగ్యశ్రీ బిల్లులే రూ.1080 కోట్లు పెండింగ్‌!

  • టీజీఎంఎస్‌ఐడీసీ ఔషధ బకాయిలు రూ.1019 కోట్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ‘ఆర్థిక’ సుస్తీ చేసింది. అత్యవసర శాఖకు ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేస్తోంది. ఈ శాఖలోని ఏ విభాగానికీ సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఓ వైపు ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించగా.. మరోవైపు ఆస్పత్రుల్లో కనీస ఔషధాలు ఉండట్లేదు. మందులు సరఫరా చేసే ఏజెన్సీలు సైతం బిల్లులు రాక చేతు లెత్తేస్తున్నాయి. దీంతో పేదలకు వైద్యసేవలందించే ఈ విభాగం కుప్పకూలే పరిస్థితి నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖలో అన్ని విభాగాలకు కలిపి సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వైద్యఆరోగ్యశాఖలో ప్రతి నెలా సగటున కనీసం రూ.535 కోట్లు అవసరం అవుతున్నాయి. వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో రోగులకిచ్చే డైట్‌ చార్జీలకు నెలకు రూ.8.5 కోట్లు కావాలి. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఔషధాలకు రూ.50 కోట్లు, పారిశుధ్య, భద్రత, రోగుల సంరక్షణ సిబ్బందికి రూ.31 కోట్లు, అద్దెలకు రూ.2 కోట్లు, విద్యుత్తు బిల్లులకు రూ.10.08 కోట్లు, ఇతర ఖర్చు లకు రూ.0.65 కోట్లు కావాలి. వీటితో పాటు అత్యవసర సేవలందించే విభా గాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వైద్యులు, స్టాఫ్‌న ర్సులకు రూ.185.58కోట్లు కావాలి. జూనియర్‌ డాక్టర్లు, ఇతరుల స్టయిపెండ్‌ కోసం ప్రతి నెలా రూ.47.34 కోట్లు అవసరం అవుతున్నాయి. ఇక ఆస్పత్రుల్లో సివిల్‌ పనులు, కొత్త నిర్మాణాలకు రూ.100 కోట్లు కావాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు కోసం కనీసం రూ.100 కోట్లు కావాలి. మొత్తం మీద ప్రతినెలా రూ.535 కోట్లు కావాలి. కానీ, ఆర్థిక శాఖ నుంచి ఇందులో పావు వంతు నిధులు కూడా విడుదల కావడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.50 కోట్లు, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ)కు మరో రూ.50 కోట్లు, జూడాల స్టయిపెండ్‌ మాత్రమే విడుదల చేస్తున్నారు. మిగతా అవసరాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని అంటున్నారు. ఔషధ కార్పొరేషన్‌కు చెల్లించే 50 కోట్లు కూడా ఒక నెల మందుల బిల్లుల కోసం ఇస్తే.. మరో నెల ఆస్పత్రుల నిర్మాణాల కోసం విడుదల చేస్తున్నారు.


పెండింగ్‌ బకాయిలు రూ.3 వేల కోట్ల పైనే..

వైద్య ఆరోగ్యశాఖలో పెండింగ్‌ బిల్లులు సుమారు రూ.3000 కోట్ల పైచిలుకు ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు రూ.1080 కోట్లు బకాయిలున్నాయి. అలాగే టీజీఎంఎస్‌ఐడీసీకి రూ.1019 కోట్లు, కాంట్రాక్టు వైద్యులు, ఇతర మానవ వనరుల వేతనాలకు రూ.226 కోట్లు, విద్యుత్తు బకాయిలు రూ.195 కోట్లు, ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్‌ సిబ్బంది వేతనాలు రూ.89 కోట్లు, డైట్‌ బిల్లులు రూ.7.23 కోట్లు, అద్దెలు రూ.11 కోట్లు, స్టయిపెండ్‌ రూ.8.11 కోట్ల బకాయులు ఉన్నాయి. ఇవిగాక జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కలపాలి. అందులోనూ రూ.158 కోట్లు పెండింగ్‌ పెట్టారు. వీటితో పాటు ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయులు కూడా పెద్దమొత్తంలో ఉన్నాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

నర్సింగ్‌ కాలేజీలకు రూ.100 కోట్లు..

ఇక ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు స్టయిపెండ్‌ రెండు మూడేళ్లుగా చెల్లించడం లేదు. ఇవి కూడా రూ.100 కోట్ల వరకు పెండింగ్‌ ఉన్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో 40 శాతం ఇస్తే.. ఆ మొత్తం విడుదలవుతుంది. రాష్ట్ర సర్కారు 40 శాతం విడుదల చేయకపోవడంతో రెండు మూడేళ్లుగా ప్రైవేటు కాలేజీల్లో చదివే నర్సింగ్‌ విద్యార్థులకు స్టయిపెండ్‌ నిలిచిపోయింది. అక్కడ చదివే వారిలో మెజారిటీ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలేనని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Sep 15 , 2025 | 06:09 AM