Promotions: ఎక్సైజ్‌శాఖలో ఎట్టకేలకు పదోన్నతులు
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:50 AM
రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అధికారుల పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది....
53 మంది అధికారులకు ప్రమోషన్
డీపీసీ కీలక నిర్ణయం.. త్వరలో జీవో
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అధికారుల పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సోమవారం నిర్వహించిన సమావేశంలో మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ సిఫారసు చేసింది. దాని ప్రకారం.. అడిషనల్ కమిషనర్లు 2, జాయింట్ కమిషనర్లు 2, డిప్యూటీ కమిషనర్లు 12 మంది, అసిస్టెంట్ కమిషనర్లు 14 మంది, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు 23 మంది పదోన్నతులు పొందారు. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు (జీవో) జారీ చేయనుంది. డిప్యూటీ కమిషనర్ (డీసీ) స్థాయిలోపు అధికారులకు మాత్రమే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే అధికారం ఉంటుంది. ఆ పై స్థాయికి వెళితే ఆ అవకాశం కోల్పోతామని భావించిన కొందరు సుదీర్ఘకాలంగా డీసీ, ఏసీలుగానే కొనసాగుతున్నారు. కొందరు డీసీలు తమకు పదోన్నతులు వద్దని లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. సంఘ నాయకుడు ఒకరు తనకు పదోన్నతి వద్దని, తాను పనిచేస్తున్న జిల్లా నుంచి కదిలించొద్దంటూ లేఖ రాశారు. దీంతో కిందిస్థాయిలోని సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెట్లకు పదోన్నతి దక్కడం లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎక్సైజ్ శాఖలో ఇంతవరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. పదేళ్లకుపైగా అర్హులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క అధికారి హోదా పెరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. అనేక సార్లు డీపీసీ అధికారులు సమావేశమైనా ఎటూ తేల్చలేదు. ఈ నేపథ్యంలో పదోన్నతులు వద్దంటూ కొందరు డీసీలు రాసిన లేఖలను ప్రస్తావిస్తూ జరుగుతున్న జాప్యంపై ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘మాకొద్దు పదోన్నతులు!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలతో అదే రోజున ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. డీపీసీ చైర్మన్ వికాశ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జెడీ, కన్వీనర్ సెక్రటరీ బెనహర్ మహేశ్ దత్ ఎక్కా, సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొని అధికారుల అర్హతలు పరిశీలించి 53 మందికి పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.