Final Phase of Panchayat Elections: తుది పంచాయతీ నేడే!
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:52 AM
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారంతో ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసిపోనుంది. 182 మండలాల్లో సర్పంచ్.....
మూడో విడత ఎన్నికలకు రంగం సిద్ధం.. ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 నుంచి లెక్కింపు
182 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ
పోలింగ్‌కు ముందు రోజు కావడంతోమంగళవారం విచ్చలవిడిగా పంపకాలు
డబ్బులు, చీరలు, బహుమతులు కూడా..
పోటీ ఎక్కువున్న చోట్ల ఓటుకు 5వేలపైనే!
న్యూస్ నెట్‌వర్క్/ హైదరాబాద్, డిసెంబరు 16, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారంతో ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసిపోనుంది. 182 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఆ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటించారు. ఈ విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు, 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 36,483 పోలింగ్ ేస్టషన్ల పరిధిలో 53,06,401 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం ఉదయమే పోలింగ్ ప్రారంభం అవుతుండటంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రాత్రికల్లా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అన్నిచోట్లా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీగా మద్యం, డబ్బు పంపకాలు..
పోలింగ్‌కు ముందు రోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మంగళవారమే భారీగా పంపకాలు చేపట్టారు. డబ్బుతోపాటు చీరలు, మద్యం, మాంసం పంపిణీ చేయడం కనిపించింది. జనరల్ స్థానాలతోపాటు రిజర్వుడ్ పంచాయతీల్లోనూ ఈసారి భారీగా పంపకాలు జరిగాయని స్థానికులు తెలిపారు. చాలా చోట్ల ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలు ఇస్తుంటే.. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల రూ.5వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఓటు రేటు రూ.5 వేలు దాటిపోయిందని స్థానికులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వెయ్యిలోపు ఓట్లున్న మూడు పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి రూ.50లక్షల వరకు ఖర్చు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ మూడు చోట్ల అధికార కాంగ్రెస్ మద్దతుదారుతోపాటు రెబెల్ అభ్యర్థులు బరిలో ఉన్నారని అంటున్నారు. ఇక నల్లగొండ జల్లా దేవరకొండ డివిజన్‌లోని ఓ గిరిజన తండా పంచాయతీలో పోటీ ఎక్కువగా ఉందని.. దీనితో ఓ అభ్యర్థి 60 ఓట్లున్న ఒక వర్గం వారి కులదైవం గుడి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇచ్చారని స్థానికులు తెలిపారు. మరో అభ్యర్థి కూడా ఓటుకు రూ.5 వేల వరకు పంచుతున్నారని వెల్లడించారు. ఇక జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన కొండమల్లేపల్లిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు విపరీమైన పోటీ నెలకొంది. దీనితో పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.5 వేల వరకు, వార్డు అభ్యర్థులు రూ.4 వేల వరకు పంచారని స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి వెండి కానుకలు పంచారని పేర్కొన్నారు.
ఈ టెంటే పోలింగ్ కేంద్రం..
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని కొత్తపల్లి తండా పంచాయతీలో టెంట్లతో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఇది. ఈ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో రెండే గదులు ఉన్నాయి. అవి సరిపోయే పరిస్థితి లేక ఇలా టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో 877 మంది ఓటర్లు ఉన్నారు.
- చౌడాపూర్, ఆంధ్రజ్యోతి