Final Notification: 1300 చెరువులకు హద్దులు ఫైనల్
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:11 AM
హెచ్‌ఎండీఏ పరిధిలో 1300 చెరువులకు హద్దులను ఖరారు చేస్తూ ఫైనల్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. చెరువుల హద్దుల అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకున్న...
2949 చెరువులకు ప్రాథమికంగా నిర్ధారణ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ పరిధిలో 1300 చెరువులకు హద్దులను ఖరారు చేస్తూ ఫైనల్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. చెరువుల హద్దుల అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో హెచ్‌ఎండీఏతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఇప్పటి వరకు 2949 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్థారణ చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు వేసింది. ఆయా చెరువులకు ఐడీ నంబర్లను కూడా ఇచ్చింది. ఆయా చెరువులకు ప్రజల నుంచి అభ్యంతరాలన్నీ స్వీకరించి 1300 చెరువులకు హద్దులను ఖరారు చేస్తూ ఫైనల్ నోటిఫికేషన్ వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 500 చెరువులకు హద్దులను ఖరారు చేశారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది నెల రోజుల వ్యవధిలోనే 197 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్లను జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోనే నెల రోజుల్లో అత్యధికంగా 92 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ చేశారు. మెదక్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు కొంత మేరకు కృషి చేయగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఒక్క చెరువుకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఔటర్ వరకు ఉన్న చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం(ఎఫ్‌టీఎల్), బఫర్‌జోన్ నిర్ధారణకు తుది నోటిఫికేషన్‌ను వచ్చే నేల నుంచి ప్రకటించనున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కూడా గుర్తించనున్నట్టు చెప్పారు.