Telangana Battles Cold Wave: రాష్ట్రానికి చలి జ్వరం!
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:40 AM
రాష్ట్రానికి చలి జ్వరం పట్టుకుంది. చల్లటి వాతావరణం కారణంగా వైర్‌సల విజృంభణ పెరిగి ఎక్కడ చూసినా.. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. చలికారణంగా కీళ్లు, కండరాలు పట్టేసుకుని ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి.....
చాలా చోట్ల 5-13 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
అతి శీతల వాతావరణంతో విజృంభిస్తున్న వైర్‌సలు
చాలా మందిలో జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు
15 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు ఉంటేనే శరీరానికి తట్టుకోగలిగే సామర్థ్యం.. తగ్గితే ఇబ్బందులే!
ఉదయం పూట గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చలి జ్వరం పట్టుకుంది. చల్లటి వాతావరణం కారణంగా వైర్‌సల విజృంభణ పెరిగి ఎక్కడ చూసినా.. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. చలికారణంగా కీళ్లు, కండరాలు పట్టేసుకుని ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి. శ్వాస కోశ సమస్యలున్న వారు మరింతగా ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. చలి కారణంగా రోగ నిరోధక శక్తి మందగించడం, అదే సమయంలో వైర్‌సల వ్యాప్తి పెరగడంతో.. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ శీతల వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. రోజంతా గోరు వెచ్చని నీటిని తీసుకోవాలని, దానితో శరీర ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు గొంతు, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం ఉంటుందని సూచిస్తున్నారు. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయట తిరగవద్దని, స్వెట్టర్లు, మఫ్లర్లు, సాక్సులు, గ్లౌజులు ధరించాలని అంటున్నారు. రోజుకు రెండుసార్లు ఆవిరి పడితే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుందని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థలపై ప్రభావం
సాధారణంగా బయట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నా.. మన శరీర ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల మధ్య ఉంటుంది. మెదడు హైపోథాలమస్ గ్రంథి ద్వారా శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరును నియంత్రిస్తూ ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది. అయితే మానవ శరీరానికి 15 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలనే తట్టుకునే సామర్థ్యం ఉంటుందని.. అంతకన్నా తగ్గితే ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థల పనితీరు దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయట ఉష్ణోగ్రతలు మరీ ఐదారు డిగ్రీల స్థాయికి తగ్గితే ఈ సమస్య మరింత పెరుగుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 13 డిగ్రీలలోపు నమోదవుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
రెండు పెగ్గుల వేడి తాత్కాలికమే!
అసలే డిసెంబరు ఆఖరు.. గజగజా వణికించే చలి.. పొద్దుగూకగానే రెండు పెగ్గులేస్తే చలి అదే పోతుందనేది మందుబాబుల్లో ఉన్న అభిప్రాయం. చలి నుంచి ఉపశమనం కోసం కొందరు మద్యం తాగుతుంటారు. నిజానికి ఇది అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి కొంతమేర శరీర ఉష్ణోగ్రత పెరిగి, తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని.. కానీ కాసేపటి తర్వాత రక్తనాళాలు సాధారణ స్థాయి కంటే తగ్గిపోతాయని చెబుతున్నారు. దీనితో రక్తపోటు పెరుగుతుందని, కొందరిలో హైపోథెర్మియా పరిస్థితికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
తీవ్ర చలితో అనేక ఆరోగ్య సమస్యలు
వాతావరణం చల్లబడటం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. శరీర ఉష్ణోగ్రత తగిన స్థాయిలో ఉండేందుకు రక్తమే కీలకం. రక్తనాళాలు కుంచించుకుని.. రక్త సరఫరా సరిగా జరగకపోవడం, బీపీ పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఉదయం వేళ గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదమూ ఉంటుంది. చలికి కీళ్లు, కండరాలు పట్టేసి నొప్పులు వేధిస్తాయి. రోగ నిరోధక శక్తి మందగిస్తుంది. చలి వాతావరణంలో బ్యాక్టీరియా, వైర్‌సలు విజృంభించి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, ఎండీ జనరల్ మెడిసిన్, ఎండీ శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం