Share News

kumaram bheem asifabad- మార్కెట్‌లో పండగ సందడి

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:54 PM

సద్దుల బతుకమ్మ, దసరా పండగలతో సందడి నెలకొంది. జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ జరుపకోనున్నారు. దీంతో ఆదివారం ప్రజలు షాపింగ్‌లో బిజీ బిజీగా గడిపారు. దీంతో వస్త్ర దుకాణాలు, లేడిస్‌ ఎంపోరియంలు, కిరాణం షాపులు రద్దీగా మారాయి. హిందువులకు దసరా అతి పెద్ద పండుగ, నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ప్రజలు చివరగా దసరా వేడుకలను నిర్వహించుకుంటారు.

kumaram bheem asifabad- మార్కెట్‌లో పండగ సందడి
ఆసిఫాబాద్‌లో బంతిపూలను విక్రయిస్తున్న వ్యాపారులు

- పల్లెలకు ప్రజల ప్రయాణం

- నేడు సద్దుల బతుకమ్మ

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సద్దుల బతుకమ్మ, దసరా పండగలతో సందడి నెలకొంది. జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ జరుపకోనున్నారు. దీంతో ఆదివారం ప్రజలు షాపింగ్‌లో బిజీ బిజీగా గడిపారు. దీంతో వస్త్ర దుకాణాలు, లేడిస్‌ ఎంపోరియంలు, కిరాణం షాపులు రద్దీగా మారాయి. హిందువులకు దసరా అతి పెద్ద పండుగ, నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ప్రజలు చివరగా దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. ఈ పండుగకు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు. అందుకే వస్త్ర దుకాణాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌ పట్టణంలోని రెడిమేడ్‌ దుస్తుల దుకాణాలు సందడిగా మారాయి. మహిళలకు అతి పెద్ద పండగ అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా వివిధ రకాల పూలు, రంగుల కొనుగోలులో మహిళలు, యువతులు బిజీ బిజీగా గడిపారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చెందుకు పూలను కొనుగోలు చేపట్టారు. పండుగ కోసం ప్రజలు పట్టణాల నుంచి స్వగ్రామాల బాట పడుతున్నారు. వారి రాకతో గ్రామాల్లో సందడిగా మారుతున్నాయి. పండగ రోజున పిండి వంటల కోసం సామగ్రి కొనుగోలు నేపథ్యంలో కిరాణం దుకాణాలు రద్దీగా మారాయి. రెండు, మూడు రోజుల నుంచి జిల్లాలో వ్యాపారం పెరిగింది. మార్కెట్‌లో పూల కొనుగోళ్లు సైతం జోరుగా కొనసాగాయి. బతుకమ్మ తయారీలో కీలక భూమిక పోషించే తంగెడు పూలు, గునుగు, పట్టుకుచ్చులు, బంతి, చేమంతి పూలు కొనుగోలు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది పూల ధరలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక మోస్తరు బతుకమ్మ తయారీ కోసం వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వార సంతలో బతుకమ్మ, దసరా పండగల సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలు దారులు రావడంతో వార సంత కిటకిటలాడింది. బట్టల దుకాణాలు, పూల దుకాణాలు, కాస్మోటిక్‌ దుకాణాల్లో యువతీ యువకులు సామాగ్రిని కొనుగోలు చేశారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో యువతులు, మహిళలు దుస్తులు, డ్రెస్సులు, శారీలు, వివిధ కాస్మోటిక్స్‌ కొనుగోలు కోసం తరలి వచ్చారు. యువకులు దసరా పండగకి బట్టలు కొనుగోలు చేసేందుకు షాపులలో బారులు తీరారు. అదే విధంగా పండగ కోసం వివిధ రకాల పిండి పదార్థాలు చేసుకోవడానికి సామగ్రిని కొనుగోలు చేశారు. వారసంత పండగల నేపథ్యంలో కొనుగోలుదారులతో సందడిగా మారింది.

Updated Date - Sep 28 , 2025 | 10:54 PM