Fee Reimbursement: ప్రైవేటు కాలేజీల సమ్మె విరమణ
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:54 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గత ఐదురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు కొనసాగిస్తున్న సమ్మెకు తెరపడింది....
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గత ఐదురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు కొనసాగిస్తున్న సమ్మెకు తెరపడింది. సమ్మెను విరమిస్తున్నట్లు ‘‘ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్’’ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ-ఫాతీ) ప్రకటించింది. గత సోమవారం నుంచి అన్ని కాలేజీలు మూతపడటంతో పలు వర్సిటీల్లో పరీక్షలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో ఫాతీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఈ విషయంపై ఇటివలే ప్రభుత్వ ముఖ్య సలహదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి గురువారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేనతోపాటు అన్ని సంక్షేమ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఫీజు బకాయిలపై సుదీర్ఘంగా సమీక్షించారు. అప్పటికప్పుడే సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి సమ్మె విరమించేలా ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిసింది. దీనిపై సుదర్శన్ రెడ్డి శుక్రవారం భట్టితో చర్చించారు. అనంతరం భట్టి, ఫాతీ ప్రతినిధులను చర్చలకు పిలిచి వారితో సమావేశమయ్యారు. చర్చలు ముగిశాక మీడియాతో భట్టి మాట్లాడారు. ఫీజు బకాయిల్లో ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదలచేశామని, ఫాతీ ప్రతినిధులు కోరినట్లుగా మరో రూ. 900 కోట్లు త్వరలో విడుదలచేస్తామని అన్నారు. అలాగే ప్రతినెలా బకాయిల్లో ఎన్నోకొన్ని విడుదల చేసేలా ప్రణాళికబద్దంగా కార్యచరణ అమలుచేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో భవిష్యత్తులో చేపటనున్న సంస్కరణలపై కమిటీ వేశామని, సాధ్యమైనంత త్వరలో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.
శ్రీదేవసేన వ్యాఖ్యలతో బాధపడ్డాం..: రమేశ్ బాబు
ఈనెల 3వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఫాతీ అధ్యక్షుడు నిమ్మటూరి రమేశ్ బాబు ప్రకటించారు. సమ్మె కారణంగా విద్యార్థులకు జరిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని చెప్పారు. వాయిదాపడ్డ పరీక్షలు త్వరలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన, ఇతర ఐఏఎస్ అధికారులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన వ్యాఖ్యలతో బాధపడ్డామని చెప్పారు. కీలక హోదాలో ఉంటూ ప్రైవేటు కాలేజీలను అవమానపరిచేలా మాట్లాడొద్దు అని మాత్రమే తాము చెప్పామని, అయితే తమ వ్యాఖ్యలను వక్రీకరించారని, దీనికి చింతిస్తున్నామని రమేష్ బాబు తెలిపారు. ఫాతీ సెక్రటరీ జనరల్ రవికుమార్ మాట్లాడుతూ చర్చలు విజయవంతం కావడంతో శనివారం జరగాల్సిన అధ్యాపకుల బహిరంగసభ, విద్యార్థుల లాంగ్ మార్చ్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.