Family Tragedy: కన్నతల్లి కడచూపూ కరువాయె
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:49 AM
కన్నతండ్రిది రాతిగుండె అని తేలిపోతే, తానూ నిర్దయురాలినేనని కన్నతల్లీ చాటుకుంది...
ముగ్గురు పిల్లల మృతదేహాలను చూసేందుకు రాని దీపిక
అంత్యక్రియలు నిర్వహించిన మునిసిపాలిటీ
నాగర్‌కర్నూలు/త్రిపురాంతకం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కన్నతండ్రిది రాతిగుండె అని తేలిపోతే, తానూ నిర్దయురాలినేనని కన్నతల్లీ చాటుకుంది. భార్యతో గొడవపడిన భర్త, అభంశుభం తెలియని పదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లల ప్రాణాలను బలిగొంటే.. ఆ భార్యేమో తన పిల్లలను కడసారి చూసేందుకు కూడా రాలేదు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెం మండలం పెద్దబోయినిపల్లికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి మోక్షిత (8), వర్షిణి (6), శివధర్మ (4) సంతానం. భార్యతో గొడవ పడిన వెంకటేశ్వర్లు గత నెల 30న ముగ్గురు పిల్లలను బైక్‌పై ఎక్కించుకొని నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండకొచ్చాడు. అక్కడ పిల్లలతో పురుగుల మందు తాగించి.. వారి ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించి చంపాడు. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరు మృతదేహం బుధవారమే లభ్యమైంది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. వర్షిణి, శివధర్మ మృతదేహాలను శుక్రవారం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారుల బాబాయి మల్లికార్జున, తండ్రి తరఫు బంధువులు అక్కడికొచ్చి మృతదేహాలను మునిసిపాలిటీ సిబ్బందికి అప్పగించారు. వారు పట్టణంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మోక్షిత మృతదేహానికి కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడ మృతురాలి చిన్నాన్న మల్లికార్జున, బంధువులు తాము మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లలేమని చెప్పడంతో సిబ్బంది స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా, కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వెంకటేశ్వర్లు.. తాను చనిపోతే, పిల్లలు ఇబ్బందులు పడతారని భావించే వారిని చంపేసి ఉంటాడని చర్చించుకుంటున్నారు.