Pet Basheerabad: కూతుర్ని చంపి తండ్రి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:41 AM
అధికమైన ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ తండ్రి.. కూతుర్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం చోటు చేసుకుంది.
ప్రమాదంలో వికలాంగురాలైన భార్య
పెరిగిన అప్పులు.. దిక్కు తోచక ఆత్మహత్య
పేట్ బషీరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అధికమైన ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ తండ్రి.. కూతుర్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బహదూర్‌పల్లి వాసి అశోక్ (50), భార్య సోని, కూతురు దివ్య (5)లతో కలిసి ఇందిరమ్మ కాలనీలో అద్దెకుంటూ వంట మనిషిగా జీవిస్తున్నాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొట్టడంతో భార్య సోనీ ఎడమ కాలు తీసేయడంతో ఇంట్లోనే ఉంటుండగా, అశోక్‌కూ ఏ పని దొరకక ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో జీవితంపై విరక్తితో 3 రోజుల క్రితం రాత్రి ఇంట్లో గ్యాస్ లీక్ చేసి.. కుటుంబ సభ్యులంతా చనిపోదామనుకున్నాడు. భార్య బయటికొచ్చి కేకలేయడంతో చుట్టు పక్కల వారి సాయంతో గ్యాస్ సిలిండర్‌ను ఆఫ్ చేశారు. మరునాడు కూతురు దివ్యతో కలిసి బయటకెళ్లిన అశోక్.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాల వెనుక చెరువులో గురువారం శవాలై తేలారు. మృతులు ఇందిరమ్మ కాలనీ వాసులని స్థానికులు చెప్పడంతో అశోక్ భార్య సోనికి సమాచారమిచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.