Father Reunites with Son: 35 ఏళ్ల తర్వాత కొడుకును చూడబోతున్నా
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:58 AM
గట్టిగా గాలి వీస్తే పైకప్పు ఎగిరిపోయే పూరిగుడిసెలో ఉంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. కూలి పనికి వెళితే గానీ పూట గడవని దయనీయ స్థితిలో భారంగా కాలం వెళ్లదీస్తున్న....
4రోజుల్లో ఇంటికొస్తానన్నాడు.. కొడుకును చూస్తూ బతికేస్తా
లొంగిపోయిన మావోయిస్టు ఆజాద్ తండ్రి సమ్మయ్య భావోద్వేగం
గోవిందరావుపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గట్టిగా గాలి వీస్తే పైకప్పు ఎగిరిపోయే పూరిగుడిసెలో ఉంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. కూలి పనికి వెళితే గానీ పూట గడవని దయనీయ స్థితిలో భారంగా కాలం వెళ్లదీస్తున్న ఆ 70 ఏళ్ల పెద్దాయన, ఆయన కోడలి కళ్లలో ఇప్పుడు మాటల్లో చెప్పలేని ఆనందం. 35ఏళ్ల తర్వాత కన్న కొడుకును చూడబోతున్నానన్న ఆనందం ఆ పెద్దాయనది. 2003 తర్వాత భర్త మళ్లీ తన చెంతకు రానున్నాడనే సంతోషం ఆయన కోడలిది. ఇదంతా.. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న తండ్రి సమ్మయ్య, మాజీ మావోయిస్టు రూప గురించే! ఆజాద్ శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయన రాక కోసం తండ్రి సమ్మయ్య, భార్య నగరం రూప అలియాస్ సుజాత ఎదురుచూస్తున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెంలో ఓ చిన్న పూరిగుడిసెలో సమ్మయ్య, రూప జీవిస్తున్నారు. ఆదివారం వీరిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. 35 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొడుకు మళ్లీ తిరిగిరాలేదని.. తన గొంతు కూడా వినిపించలేదని సమ్మయ్య చెప్పారు. తమకు గుంట భూమి కూడా లేదని.. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నానని ఆవేదనగా చెప్పారు. తన ఎదురుచూపులకు తెరపడిందని, కొడుకును చూసుకుంటూ శేష జీవితం గడుపుతానని చెప్పారు. తాను 13ఏళ్ల వయసులోనే దళంలో చేరానని ఆజాద్ భార్య రూప చెప్పారు. పార్టీ అనుమతితో దళంలోనే ఆజాద్‌ను పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు. రెండేళ్లు కలిసి ఉన్నామని..ఆరోగ్యం క్షీణించడంతో బయటకు వచ్చానని వెల్లడించారు.తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వాలు నాలుగేళ్లపాటు తనను నిర్బందించాయని.. 2003లో తాను విడుదలయ్యాయని తెలిపారు. భర్తఊరైన మొద్దులగూడెం వచ్చి, వృద్ధాప్యంలో ఒంటరిగా బతుకున్న మామ సమ్మయ్య ఆలనాపాలనా చూసుకుంటున్నానని చెప్పారు