Share News

Family Tragedy,: నేనేం తప్పు చేశా నాన్నా

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:35 AM

పేదరికం, హృద్రోగంతో పుట్టిన కన్నకొడుకుకి వైద్యం చేయించలేని నిస్సహాయత.. అంతకుమించి వైద్యం చేయించడం చేతకాని వాడివి ఎందుకు..

Family Tragedy,: నేనేం తప్పు చేశా నాన్నా

  • వైద్యం చేయించలేక మూడేళ్ల కొడుకును చంపేసిన తండ్రి

  • మృతదేహాన్ని మూసీలో పారేసిన వైనం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): పేదరికం, హృద్రోగంతో పుట్టిన కన్నకొడుకుకి వైద్యం చేయించలేని నిస్సహాయత.. అంతకుమించి ‘ వైద్యం చేయించడం చేతకాని వాడివి ఎందుకు కన్నావు?’ అంటూ భార్య సూటిపోటి మాటలు.. ఈ పరిస్థితుల్లో ఓ తండ్రి కన్నప్రేమను మరిచాడు. ఏ పాపమూ ఎరుగని తన మూడేళ్ల కుమారుడిని బలి తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌, సనా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు. అక్బర్‌ కూరగాయల వ్యాపారి కాగా సనా నీలోఫర్‌ ఆస్పత్రిలో కేర్‌టేకర్‌గా పని చేస్తుంది. ఈ దంపతుల చిన్న కుమారుడు మహ్మద్‌ అన్‌స(3)కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఆ పసివాడికి సరైన వైద్యం చేయించలేకపోతున్నారు. ఈ విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. వైద్యం చేయించలేని వాడివి ఎందుకు కన్నావు.. అంటూ అక్బర్‌ను భార్య సనా దూషించేది. ఈ క్రమంలో రోజురోజుకి ఇబ్బందులు పెరిగిపోతుండడంతో అసహనానికి గురైన శనివారం తెల్లవారుజామున అనస్‌ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం అనస్‌ మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి ఆ మూటను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి అఫ్జల్‌గంజ్‌ సమీపంలోని మూసీ నదిలో విసిరేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా బండ్లగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదుచేశాడు. ఘటనా స్థలిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు..అక్బర్‌ ఓ మూటతో బైక్‌ పైవెళుతుండడాన్ని గుర్తించారు. దీంతో అక్బర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపెట్టాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి మృతదేహం కోసం డీఆర్‌ఎఫ్‌ మూసీలో గాలింపు చేపట్టారు.

Updated Date - Sep 15 , 2025 | 04:35 AM