Share News

Family Dispute: ఓ తండ్రి తీర్పు

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:50 AM

ఆస్తి చేజిక్కించుకుని తన సంరక్షణ మరిచిన కుమారుడి ప్రవర్తనపై విసుగు చెందిన తండ్రి.. తన పేరిటఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు...

Family Dispute: ఓ తండ్రి తీర్పు

  • సంరక్షణ మరిచిన కుమారుడికి గుణపాఠం

  • రూ.3 కోట్ల విలువ చేసే 3 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత

ఎల్కతుర్తి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆస్తి చేజిక్కించుకుని తన సంరక్షణ మరిచిన కుమారుడి ప్రవర్తనపై విసుగు చెందిన తండ్రి.. తన పేరిటఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్‌రెడ్డి, వసంత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శ్యాంసుందర్‌రెడ్డి 2006 నుంచి 2011 వరకు ఎల్కతుర్తి ఎంపీపీగా సేవలందించారు. కుమార్తెకు వివాహం చేయగా ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు రంజిత్‌రెడ్డి సైతం అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో తిరిగి ఇండియాకు వచ్చాడు. అప్పటి నుంచి హనుమకొండలో ఉన్న సొంత ఇంట్లో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. శ్యాంసుందర్‌రెడ్డి భార్య వసంత 2021లో మృతిచెందారు.అప్పటి నుంచీ ఆయన ఎల్కతుర్తిలో ఉన్న తన పాత ఇంట్లోనే ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కన్న తండ్రి బాగోగులు చూడాల్సిన కుమారుడు రంజిత్‌రెడ్డి పట్టించుకోవడం మానేశాడు. హనుమకొండలో తన పేర ఉన్న ఇంటిని కుమారుడు రంజిత్‌రెడ్డి తనపేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని.. అదేమని అడిగితే తనపై దాడి చేసి ఇంటి నుంచి గెంటివేశాడని శ్యాంసుందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తన భార్య వసంత పేర ఉన్న మూడెకరాల భూమిని సైతం కొడుకు విరాసత్‌ పట్టా చేయించుకున్నట్టు ఆయన తెలిపారు. దాంతోపాటు తన కుమార్తెకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని సైతం రంజిత్‌రెడ్డి అక్రమించుకుని సాగు చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. తనను ఆదరించని.. బుక్కెడు బువ్వ పెట్టని కుమారుడికి తన ఆస్తి దక్కనివ్వనన్నారు. ఈ మేరకు తన పేర ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 3ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఆర్డీవో రమేశ్‌ రాఽథోడ్‌ను సోమవారం కలిసి.. రూ.3కోట్ల విలువ గల 3ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు వీలునామా రాసి అఽధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో.. తన భార్య వసంత జ్ఞాపకార్థం పక్కా భవనాలను నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని కోరారు. తల్లిదండ్రులను ఆదరించని ప్రతి వ్యక్తికీ ఇది ఒక గుణపాఠం కావాలన్నారు.

సర్వే చేసి స్వాధీనం చేసుకుంటాం

మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించిన భూమికి సంబంధించి.. సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తాం. భూమిని స్వాఽధీనం చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.

- ఐతరాజు ప్రసాద్‌రావు, తహసీల్దార్‌

Updated Date - Oct 15 , 2025 | 04:50 AM