Hyderabad road accident: హైదరాబాద్ బీజాపూర్.. రోడ్డుపై ఘోర ప్రమాదం
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:42 AM
హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు..
రెండు కార్లు ఢీకొని ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
రంగారెడ్డి జిల్లా కనకమామిడి స్జేజీ సమీపంలో ఘటన
మొయినాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఒకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి స్టేజీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన కరీం(37) కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జగద్గిరిగుట్టకు చెందిన ఫొటోగ్రాఫర్ బాబురావు, కుత్బుల్లాపూర్‌కు చెందిన షేక్ అకీల్, బంజారాహిల్స్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ లోకేశ్(24) ఓ ఫొటో షూట్‌కు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం కరీం క్యాబ్ కారులో బయలుదేరారు. కారు మొయినాబాద్ దాటిన తరువాత రాంగ్‌రూట్‌లోకి వెళ్లి ఎదురుగా తాండూరు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్ల ముందు బాగాలు నుజ్జనుజ్జయ్యాయి. క్యాబ్ డ్రైవర్ కరీం అందులోనే ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. క్యాబ్‌లో ఉన్న లోకేశ్‌కు తీవ్ర గాయాలు కాగా బాబూరావు, అకీల్‌కు స్వల్పగాయాలయ్యాయి. లోకేశ్(24) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కారులో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న డాక్టర్ వంశీధర్‌రెడ్డి, వారి బంధువులు సుజాత, రోజా, డ్రైవర్ వెంకట్ ఉన్నారు. ఇందులో డ్రైవర్ వెంకట్‌కు తీవ్ర గాయాలు కాగా సుజాత, రోజాకు స్వల్పగాయాలయ్యాయు. స్థానికులు వెంటనే స్పందించి కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.