Share News

Fatal Electric Shocks: వినాయక విగ్రహాల తరలింపులో విద్యుదాఘాతాలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:50 AM

వినాయక చవితి నేపథ్యంలో మండపాల్లో ప్రతిష్ఠించేందుకు గణేశుడి భారీ విగ్రహాలు తీసుకువస్తూ విద్యుదాఘాతానికి..

Fatal Electric Shocks: వినాయక విగ్రహాల తరలింపులో విద్యుదాఘాతాలు

  • వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

  • హైదరాబాద్‌, కామారెడ్డిలో ఘటనలు

  • గణేశ్‌ మండపం పనుల్లో ఉండగా షాక్‌

  • హైదరాబాద్‌లో మరో యువకుడి మరణం

మదీన/చాంద్రాయణగుట్ట, పాల్వంచ, సిరిసిల్ల క్రైం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి నేపథ్యంలో మండపాల్లో ప్రతిష్ఠించేందుకు గణేశుడి భారీ విగ్రహాలు తీసుకువస్తూ విద్యుదాఘాతానికి గురై వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌, పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో వికాస్‌ ఠాకూర్‌ (21), రత్లావత్‌ ధోని(20) అనే యువకులు మరణించారు. కామారెడ్డి జిల్లా ఆరేపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన కొమ్ము లక్ష్మీనారాయణ(19) అనే యువకుడు మరణించాడు. బండ్లగూడ పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌లోని హుసేని ఆలం చంద్రికాపురానికి చెందిన అఖిల్‌, వికాస్‌ ఠాకూర్‌ సహా మరికొందరు తమ ప్రాంతంలో ప్రతిష్ఠించేందుకు కావాల్సిన విగ్రహం కోసం రత్లావత్‌ ధోనికి చెందిన ట్రాక్టర్‌లో జల్‌పల్లిలో వెళ్లారు. కొనుగోలు చేసిన విగ్రహంతో తిరిగి వస్తుండగా బండ్లగూడ రాయల్‌సీ హోటల్‌ సమీపంలో పైనున్న విద్యుత్‌ తీగలు వినాయక విగ్రహానికి తగిలాయి. దీంతో విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో ట్రాక్టర్‌ ట్రాలీలో ఉన్న యువకులంతా ఒక్కసారిగా కిందికి దూకేశారు. అయితే, ట్రాక్టర్‌ డ్రైవర్‌ ధోనితోపాటు, వికాస్‌ ఠాకూర్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తోటి యువకులు వారిని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా ఇరువురు అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. అయితే, ధోని, వికాస్‌ ఠాకూర్‌ మరణానికి విద్యుదాఘాతం కారణం కాదని విద్యుత్‌ శాఖ సీఎండీ ముషారఫ్‌ విలేకరులతో అన్నారు. విగ్రహం విద్యుత్‌ తీగలకు తాకినప్పుడు ఓ మెరుపు వచ్చిందని, దానిని చూసిన యువకులంతా వాహనం నుంచి కిందికి దూకారని చెప్పారు. ఈ క్రమంలో గాయపడి వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వివరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేర్‌ మండలం నాగులపల్లి తండాకు చెందిన రత్లావత్‌ ధోని ట్రాక్టర్‌ నడుపుతూ తన తండ్రి, తమ్ముడు, చెల్లిని పోషిస్తున్నాడు. ధోనికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయమవ్వగా నవంబరులో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ లోపే ప్రాణాలు కోల్పోయాడు. ధోని కుటుంబసభ్యులు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ బండ్లగూడ పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ఇక, బిహార్‌ నుంచి హైదరాబాద్‌ వలస వచ్చిన ఓ కుటుంబానికి చెందిన వికాస్‌ ఠాకూర్‌ డిగ్రీ చదువుతూ.. జూపార్క్‌ పార్కింగ్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

CGN.jpg


పుట్టిన రోజునే తుది శ్వాస

సిరిసిల్లకు చెందిన 15 మంది యువకులు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పరిధిలోని పెర్కిట్‌లో వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి మంగళవారం ఉదయం స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి స్టేజ్‌ వద్ద వీరి వాహనంలో ఉన్న వినాయక విగ్రహానికి పైనున్న 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై వాహనంలో ఉన్న కొమ్ము లక్ష్మీనారాయణ(20) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా సాయి అనే మరో యువకుడు గాయపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్‌ విద్యార్థి అయిన సిరిసిల్లకు చెందిన లక్ష్మీనారాయణ పుట్టినరోజు మంగళవారం(ఆగస్టు 19) కాగా, అదే రోజునఅతను మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

CGNCGN.jpg

వినాయక మండపం పనుల్లో ఉండగా విద్యుదాఘాతం !

హైదరాబాద్‌, బాగ్‌ అంబర్‌పేటలో వినాయక మండపం పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై గాయపడిన అదే ప్రాంతానికి చెందిన ఎం. రాంచరణ్‌(18) ఆస్పత్రిలో మరణించాడు. బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన రాంచరణ్‌ డెకరేషన్‌ పనులు చేస్తుంటాడు. బాగ్‌అంబర్‌పేట రెడ్‌ బిల్డింగ్‌ చౌరస్తా సమీపంలో స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి ఓ వినాయక మండపం నిర్మాణం పనులు చేపట్టాడు. ఇందులో భాగంగా మండపం ఎత్తు పెంచే క్రమంలో అడ్డు వస్తున్న విద్యుత్‌ తీగను రాంచరణ్‌ కర్రతో పైకి ఎత్తేందుకు యత్నించాడు. అయితే, వర్షం కురుస్తుండడం, కర్ర తడిచిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్‌ కొట్టినట్టు అయింది. దీంతో భయపడిన రాంచరణ్‌ మండపం పైనుంచి కిందికి దూకగా అతని తల వెనక భాగంలో తీవ్ర గాయమైంది. అయితే, కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంచరణ్‌ మంగళవారం సాయంత్రం మరణించాడు.

Updated Date - Aug 20 , 2025 | 04:50 AM