POCSO Court: రెండు నెలల్లో పది తీర్పులు
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:23 AM
నల్లగొండ పోక్సో కేసుల ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి ఎన్.రోజారమణి సంచలన తీర్పులిస్తూ పోక్సో చట్టం ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు. జూలై 4 నుంచి ఈ నెల 16 వరకు పది పోక్సో...
సంచలన తీర్పులిచ్చిన నల్లగొండ పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయాధికారి రోజారమణి
ఒకరికి ఉరి శిక్ష, మరొకరికి 51 ఏళ్ల జైలు
20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షలు
నల్లగొండ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ పోక్సో కేసుల ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి ఎన్.రోజారమణి సంచలన తీర్పులిస్తూ పోక్సో చట్టం ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు. జూలై 4 నుంచి ఈ నెల 16 వరకు పది పోక్సో కేసుల్లో తీర్పులిచ్చారు. వీటిలో ఒక కేసులో దోషికి ఉరి శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 20 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు విధించారు. ప్రతి కేసులో బాధితులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం ఇచ్చిన ఒక తీర్పులో.. దోషి మర్రి ఊషయ్య (63)కు 23 ఏళ్ల జైలు శిక్ష విధించడం ఈ కేసులపై జడ్జిల అప్రమత్తతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఈ సంచలన తీర్పులపై అన్ని వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
ఉరి శిక్ష పడిన మొదటి కేసు
నల్లగొండలో 2013 ఏప్రిల్ 28న నిందితుడు ముఖర్రం తన మాంసం దుకాణం సమీపంలోని ఒక బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా చున్నీతో ఉరేసి చంపాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి ఆగస్టు 14న నిందితుడికి ఉరి శిక్షతో పాటు 1.10 లక్షల జరిమానా విధించారు. పోక్సో కేసుల్లో నల్లగొండ కోర్టులో గరిష్ఠ శిక్ష పడిన మొదటి కేసు ఇదే. హతురాలి తల్లికి10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
ఎస్టీ బాలికపై అత్యాచారం కేసులో 51 ఏళ్ల జైలు
ఎస్టీ బాలికను కారులో కిడ్నాప్ చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డ మహమద్ ఖయ్యూంకు 51 ఏళ్ల జైలు శిక్ష, రూ.80 వేల జరిమానా విధిస్తూ ఆగస్టు 26న తీర్పునిచ్చారు. పోక్సో చట్టం కింద 20 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరో 20 ఏళ్లు, ఎస్టీ బాలికను కిడ్నాప్ చేసినందుకు 10 ఏళ్లు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు మరో ఏడాది కలిపి మొత్తం 51 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా విధించారు.
విద్యార్థినిపై రేప్ కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష
ఇంట్లో నిద్రిస్తున్న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 62 ఏళ్ల నిందితుడు మర్రి ఊషయ్యకు పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధించారు. మరో మూడు సెక్షన్ల కింద ఒక్కో సంవత్సరం చొప్పున మూడేళ్లు కూడా జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ నాలుగూ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. 40 వేలు జరిమానా విధించడంతో పాటు జిల్లా న్యాయ సేవా సహకార సంస్థ ద్వారా బాధితురాలికి 10 లక్షల పరిహారం అందజేయాలని తీర్పు ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు.
20 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు
పెళ్లి చేసుకుంటానని ఓ బాలికను నమ్మించి గర్భవతిని చేసి వదిలేసిన కేసులో నిందితుడు అల్లం మహే్‌షకు జూలై 4న ఇచ్చిన తీర్పులో 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా విధించారు. ఇలాంటిదే మరో కేసులో జూలై 31న నిందితుడు కట్టంగ వలిగొండ వెంకన్నకు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు. ఈ నెల 4న ఇచ్చిన ఒక తీర్పులో తిప్పర్తి యాదయ్య అనే నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా విధించారు. ఈ అన్ని కేసుల్లో బాధితురాళ్లు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అదే రోజున మరో కేసులో నిందితుడైన భాస్కరాచారి అనే లారీ క్లీనర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించారు. ఈ నెల 11న ఇచ్చిన మరో తీర్పులో నిందితుడు జడిగల హరీ్‌షకు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు. హరీష్ ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 15న ఇచ్చిన మరో తీర్పులో ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై మద్యం మత్తులో లైంగిక దాడి చేసిన నిందితుడు దోమల రాములకు 21 ఏళ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధించారు.
పోక్సో చట్టం ఏం చెబుతోందంటే...
పిల్లలకు లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం పోక్సో చట్టం-2012ను అమలు చేస్తోంది. 18 ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడిన దోషులకు ఈ చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలవుతాయి. గరిష్ఠంగా ఉరి శిక్ష, యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. రూ.25 వేల నుంచి జరిమానా విధించవచ్చు. బాధితులకు ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా 10 లక్షల వరకు పరిహారం అందిస్తారు. కాగా, పోక్సో చట్టం కింద నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నా బాలికలపై లైంగిక దాడులు ఆగడం లేదు. ఇటీవల నకిరేకల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో మొత్తం 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 108గా ఉంది.
తప్పు చేస్తే శిక్ష తప్పదనే సంకేతం
తప్పు చేస్తే శిక్ష తప్పదనే సంకేతాన్ని ఈ తీర్పులు ఇస్తున్నాయి. నేరం చేయకుండా, నేరపూరిత ఆలోచనలు కలగకుండా ఉండేందుకే పోక్సో చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయి. మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడడమనే నేరం క్షమించరానిది.
- శరత్‌చంద్ర పవార్, ఎస్పీ, నల్లగొండ జిల్లా