Share News

Paddy seedlings: వరి నారుకు చలి గండం

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:24 AM

గజ గజ వణికిస్తున్న చలి మనుషులపైనే కాదు.. వరి నారుపైనా ప్రభావం చూపుతోంది. చలి గాలుల దెబ్బకు జనంతో పాటు..

Paddy seedlings: వరి నారుకు చలి గండం

  • శీతల వాతావరణానికి రంగు మారి.. ఎదగని మడులు

  • నాట్లు ఆలస్యమవుతాయని రైతుల ఆందోళన

జగిత్యాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గజ గజ వణికిస్తున్న చలి మనుషులపైనే కాదు.. వరి నారుపైనా ప్రభావం చూపుతోంది. చలి గాలుల దెబ్బకు జనంతో పాటు.. నారు మడులు కూడా విలవిల్లాడుతున్నాయి. చాలా రోజులుగా అతి శీతల వాతావరణం కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నారు ఎదగడం లేదు. నారు ఎర్రగా మారి మురిగిపోతోంది. ఫలితంగా నాట్లు ఆలస్యమవుతున్నాయని అన్నదాతలు అంటున్నారు. వరి నారు కోసం ఎకరాకు సుమారు 20 నుంచి 30 కిలోల విత్తనాలను విత్తుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం చలి ప్రభావంతో 10 కిలోలు ఎక్కువగా వేయాల్సి వస్తోందని చెబుతున్నారు. నారు పెరగకపోవడంతో మడులను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మరో వారం, పది రోజుల్లో నాట్లు వేసుకోవాల్సిన రైతులు నారు ఎదుగుదల లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌ కోసం ఇప్పటి వరకు 77,506 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 37,697 ఎకరాలు, రెండో స్థానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 8,172 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జగిత్యాల జిల్లాలో 274 ఎకరాల్లో నాటు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందన్న అంచనా ఉంది. మరోవైపు, చలి తీవ్రత వల్ల మొక్కజొన్న ఎదుగుదల కూడా ఆగిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు. టమాట, వంకాయ, బెండకాయ, కొత్తిమీర, ఆవాలు, జొన్న, పెసర, మినుము, శనగ, వేరు శనగ, మిరప వంటి పంటలకు తెగుళ్లు ఎక్కువగా సోకి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.


మంచు పడకుండా చూసుకోవాలి

చలి ప్రభావం వల్ల నారు భూమిలో నుంచి సరైన పోషకాలను గ్రహించలేదు. వరి నారు ఎదగకుండా ఎర్రబడితే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్‌పీకే 19:19:19 ఫర్టిలైజర్‌ మందును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పు కలుపుకొని నారుపై పిచికారీ చేయాలి. రాత్రి పూట నారుమడిపై మంచు కురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మడిలో కర్రలు పాతుకుని పాలిథిన్‌ వంటి కవర్లను కప్పాలి. ఉదయం ఎండ వచ్చే లోపు తొలగించాలి. సాయంత్రం నారుకు పెట్టిన నీరును ఉదయం తొలగించి తాజా నీటితో నింపాలి.

- బలరాం, సీనియర్‌ శాస్త్రవేత్త, సీడ్‌ రీసెర్చ్‌ టెక్నాలజీ సెంటర్‌, హైదరాబాద్‌

చలి తీవ్రతతో నారు ఎదగడం లేదు

వారం, పది రోజులుగా చలి గాలులు ఎక్కువగా వీస్తుండటం, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో నారు ఎదుగుల ఉండటం లేదు. నారు ఎర్రబారుతోంది. నారు ఎదగడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.

- కల్లెం మోహన్‌, గోపులాపురం,

బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా

Updated Date - Dec 26 , 2025 | 05:25 AM