Farmers: రైతుల కష్టం వాన పాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:42 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో రైతుల కష్టం నీటి పాలైంది. అనేకచోట్ల ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది...
అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
వలిగొండ మండలంలో 14.6 సెం.మీ. వర్షం
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో రైతుల కష్టం నీటి పాలైంది. అనేకచోట్ల ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. భారీ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి ప్రజలు భయభ్రాంతులయ్యారు. యాదాద్రి-భువనగిరి, నల్లగొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు నీటి పాలయ్యాయి. ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 14.6 సెం.మీ., ఆత్మకూరు (ఎం)లో 12.8, మోత్కూరులో 11.3 సెం.మీ. వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం నక్కలగూడెంలోని కోళ్ల ఫారంలోకి వర్షపు నీరు చేరడంతో 6,000కు పైగా బ్రాయిలర్ కోళ్లు మృత్యువాతపడ్డాయి. వలిగొండ, గుండాల మండలాల్లో ఇళ్లు కూలిపోయాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉద యం వరకు ఎడతెరపి లేని వాన కురిసింది. మణుగూరులో 10.88 సెం.మీ., చర్ల మండలంలో 10.68 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వరద నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయమేర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్‌లో ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. తొర్రూరు, గూడూరు మండలాల్లో వరి నేలవాలింది. ఇన్‌ఫ్లో తగ్గడంతో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లూ మూతపడటంతో జూరాలకు 43 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గింది. దీంతో 2 గేట్ల నుంచి 16,138 క్యూసెక్కులు విడుదల చేస్త్తున్నారు.