Minister Uttam Kumar Reddy: 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు!
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:14 AM
రాష్ట్రంలో ఈ సీజన్‌లో 8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టిస్తామని, ధాన్యం..
మద్దతు ధరతోపాటు సన్నాలకు బోనస్
8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
జిల్లా కలెక్టర్లతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ సీజన్‌లో 8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టిస్తామని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బు జమ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సన్నాలకు అదనంగా ఒక క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ కూడా చెల్లిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ ప్రణాళిక ప్రకారం చేపట్టనున్న 80 లక్షల టన్నుల ధాన్యం(40 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం, 40 లక్షల టన్నుల సన్న ధాన్యం) సేకరణ ఓ రికార్డు అవుతుందన్నారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ధాన్యంకొనుగోలుకు రూ.22 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్లు నిధులు కేటాయించినట్టు చెప్పారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో 1,205 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు. ధాన్యం కాంటా పూర్తయ్యి వివరాలు నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. అందువల్ల తూకం నుంచి డేటా ఎంట్రీ వరకు సిబ్బంది కచ్చితమైన సమయపాలన పాటించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు ధాన్యం తడవకుండా రక్షణకు టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తనతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను సంప్రదించాలని, 24 గంటలూ తాను అందుబాటులో ఉంటానని ఉత్తమ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. దాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు హెల్ప్‌లైన్ నెంబరు- 1800-425-00333/ 1976కు ఫోన్ చేయాలని ఉత్తమ్ సూచించారు.
హ్యామ్‌రోడ్ల నిర్మాణానికి రేపు టెండర్ నోటిఫికేషన్ : మంత్రి సీతక్క
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం ఈ నెల 17న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. 40 శాతం ప్రభుత్వం నిర్మాణ దశలో చెల్లిస్తుందని, మిగిలిన 60శాతాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారని తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈమేరకు గురువారం క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారని, వచ్చే 30 నెలల్లో నాణ్యమైన రోడ్లు అంటే అంతా తెలంగాణ వైపు చూస్తారన్నారు.