kumaram bheem asifabad- రైతులు అధైర్యపడొద్దు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:10 PM
జిల్లాలో వరదవల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని అదుకుంటామని, అధైర్య పడొద్దని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కలెక్టరేట్‌లో వరదల వల్ల జరిగిన నష్టాల నివారణపై బుధవారం అధికారులతో సమీక్షించారు. అంతకు ముందు మండలంలోని రాజూరా గ్రామంలో వరదలకు దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు.
- అధికారులు పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించాలి
- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరదవల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని అదుకుంటామని, అధైర్య పడొద్దని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కలెక్టరేట్‌లో వరదల వల్ల జరిగిన నష్టాల నివారణపై బుధవారం అధికారులతో సమీక్షించారు. అంతకు ముందు మండలంలోని రాజూరా గ్రామంలో వరదలకు దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వారం రోజుల్లో కురిసిన బారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాల నివారణకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైనందున వాగులు, ఒర్రెలు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయి నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 6,453 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో వరద నష్టాల నివేదికలు సమర్పించాలని అదేశించారు. పంటనష్ట పోయిన పంటలకు ఎకరానికి రూ. 10వేల నష్టపరిహరం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెగిపోయిన రోడ్లు, వంతెనలు, లోలెవల్ వంతెనల వద్ద త్వరితగతిన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా కూలీన ఇళ్లు గోడల వివరాలను అందించాలని చెప్పారు. జిల్లాలో చనిపోయిన పశువుల వివరాలతో నివేదికలను రుపొందించి సమర్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ భారీ వర్షాలతో జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీశాఖ అడ్డు పడుతుందని చెప్పారు. నిర్మాణాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కుమరంభీం ప్రాజెక్టు అనకట్ట దెబ్బ తినడంతో అధికారులు కవర్లు కప్పారని ప్రస్తావించారు. వట్టివాగు ప్రాజెక్టు ప్రదాన కాలువకు గండి ఏర్పడిందన్నారు. దీంతో రైతాంగానికి సాగునీరు అందడంలేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ మండలంలోని మాలన్‌గోంది గ్రామానికి చెందిన సిడాం గంగుకు సంబందించిన మేకలు, గొర్రెలు మృత్యువాత పడటంతో రూ. 1.50 లక్షల ప్రొసిడింగ్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, ఎఫ్‌డీవో సుశాంత్, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ అజ్మీర శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మాసాదే చరణ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి వినతుల వెల్లువ..
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టీయూడబ్ల్యుజే(ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో అచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, మెడికల్ కళాశాలకు అచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని పద్మశాలీ సంఘం నాయకులు మంత్రికి విన్నవించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 50వేలు నష్టపరిహరం చెల్లించాలని సీపీఎం నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు బుధవారం ఆసిఫాబాద్‌లో ఐఎన్‌టీయూసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి కార్మిక కుటుంబాలు నివసిస్తున్న కాలనీల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిం పరిష్కరించాలని కోరారు. గోలేటి ఓపెన్‌కాస్టును త్వరగా ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటి జనరల్ సెక్రటరి ప్రకాష్‌రావు, నాయకులు పల్లాస్, సదాశివ్ పాల్గొన్నారు.