Farmers Protest Urea Shortage: యూరియా కొరత.. తీరని వ్యథ!
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:08 AM
యూరియా కొరతపై రైతులు పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్ వద్ద ప్రధాన రహదారిపై యూరియా బస్తాలు వేసి, వాటిపై బతుకమ్మను...
పలు జిల్లాల్లో రైతుల రాస్తారోకోలు.. కరీంనగర్‌లో బతుకమ్మ ఆడుతూ నిరసన
భద్రాద్రి జిల్లాలో రైతుల మధ్య ఘర్షణ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
యూరియా కొరతపై రైతులు పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్ వద్ద ప్రధాన రహదారిపై యూరియా బస్తాలు వేసి, వాటిపై బతుకమ్మను పెట్టి మహిళా రైతులు బతుకమ్మ ఆడి, రాస్తారోకో చేశారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మల్యే గంగుల కమలాకర్ యూరియా సంచులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో రైతులు రహదారిపై రైతు వేదిక ముందు రైతులు బైఠాయించి రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. లక్షెట్టిపేటలో రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి, దహెగాం మండలం చిన్న రాస్పెల్లి, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, మెదక్ జిల్లా రామాయంపేటలో రాస్తారోకోలు నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రైతులు ఎగబడడంతో పోలీసు పహారా మధ్య యూరియాను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం భారీగా తరలిరావడంతో రైతుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో ఓ రైతుకు చెందిన యూరియా బస్తాను ఇద్దరు యువకులు దొంగిలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ యువకులు రైతుకు క్షమాపణ చెప్పి యూరియా బస్తాను తిరిగిచ్చేశారు.
ప్రభుత్వ వైఫల్యం: ఈటల
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని మల్కాజి గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించా రు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సీజన్ కంటే ముందే డీడీలు కట్టి, గోదాముల్లో స్టాక్‌ను నిల్వ చేసుకోవాలని, కానీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
రైతులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్ : పొన్నం
మాజీ మంత్రి గంగుల కమలాకర్ బతుకమ్మలతో నిరసన తెలపడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. యూరియా కొరతపై బీఆర్‌ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని, ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకే బతుకమ్మ ఆడారని ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. యూరియా సమస్య ఉన్నమాట వాస్తవమేనని, కొరతను అంగీకరించక తప్పదని అన్నారు.