Share News

Farmers Protest: యూరియా కోసం అర్ధరాత్రి నుంచే బారులు!

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:50 AM

యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉంటున్న రైతన్నలు....

Farmers Protest: యూరియా కోసం అర్ధరాత్రి నుంచే బారులు!

  • రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతన్నల ఆందోళనలు

  • ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు

  • సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కుర్చీల ధ్వంసంతో ఉద్రిక్తత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉంటున్న రైతన్నలు.. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డికి రెండు లారీల యూరియా రాగా, టోకెన్ల కోసం రైతులు ఒక్కసారిగా రైతువేదిక లోపలికి దూసుకెళ్లారు. టోకెన్లు ఇవ్వకుండా సిబ్బంది చేతులెత్తేయడంతో విచక్షణ కోల్పోయిన రైతులు.. అక్కడ ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పోలీసులు వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. తూప్రాన్‌, చిన్నశంకంరంపేటలోని సూరారంలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ నిజాంపేటలోని ఎరువుల దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. శివ్వంపేట పీఏసీఎస్‌ కార్యాలయం, కుకునూరుపల్లి, హవేలీ ఘనపూర్‌, వెల్దుర్తి మండల పరిధిలోని హస్తాల్‌పూర్‌, మంగళపర్తి రైతు వేదికలు, ఆగ్రోస్‌ కేంద్రాల వద్ద రైతులు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో రైతులు బైఠాయించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలోని ఆత్మకూరు(ఎస్‌), నెమ్మికల్‌, ఏపూర్‌లో పోలీసుల పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. అర్ధరాత్రి నుంచే రైతులు బారులు దీరగా.. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. నెమ్మికల్‌ సొసైటీ వద ్ద 400మీటర్ల మేర తమ వెంట తెచ్చుకున్న వస్తువులను రైతులు క్యూలో ఉంచారు. ఏపూర్‌లో రైతుల మధ్య తోపులాట జరగ్గా.. పోలీసులు నచ్చజెప్పి సముదాయించారు. తమకు యూరియా ఇప్పించాలంటూ కొత్తగూడెం జిల్లా సరిహద్దు మండలాల్లో ఉంటున్న తమ బంధువులు, తెలిసిన వారిని ఛత్తీ్‌సగఢ్‌ రైతులు రైతులు ఆశ్రయిస్తున్నారు. క్యూలైన్లో నిలుచున్నందుకు రోజు కూలీగా రూ.300 వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో యూరియా అందలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ప్రధాన రహదారిపై అన్నదాతలు బైఠాయించారు. హనుమకొండ జిల్లాలోని పరకాలలో ప్రధాన రహదారిపై రైతుల గంట పాటు ధర్నా నిర్వహించారు. రాజకీయబలం ఉన్న వారికే బస్తాలు అందుతున్నాయన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కాన్వాయిగూడేనికి చెందిన కాసాని ఐలయ్య(44).. ప్రమాదానికి గురై మరణించగా.. యూరియా కోసం వెళ్లి వస్తున్న క్రమంలో ఇలా జరిగిందని బంధువులు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యా తండాకు చెందిన భూక్యా నర్సింగ్‌ యూరియా కోసం మండల కేంద్రానికి బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురికాగా, తీవ్ర గాయాలయ్యాయి.

Updated Date - Sep 11 , 2025 | 05:50 AM