Farmers Protest for Urea Shortage: యూరియా కోసం అన్నదాతల ఆందోళనలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:27 AM
యూరియా కోసం అన్నదాతలు ఆందోళనలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై...
వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి రాస్తారోకో
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్)
యూరియా కోసం అన్నదాతలు ఆందోళనలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. 45 నిమిషాల పాటు బైఠాయించటంతో మిర్యాలగూడ వెళ్లే దారిలో 5 కి.మీ మేర, నల్లగొండ వైపు 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలోని ఏపూర్ పీఏసీఎస్ వద్ద ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్) వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు లైన్‌లో నిలబడ్డారు. తెల్లారాక సిబ్బంది వచ్చి యూరియా రావట్లేదని చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు మరిపెడ సెంట్రల్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిజాంపేట, రాయపోల్, చిన్నకోడూరు, చిన్నశంకరంపేట, నంగునూరు తదితర మండలాల్లో రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని వరంగల్ జిల్లా రాయపర్తిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాస్తారోకో చేశారు. రాష్ట్రానికి అసమర్థ ముఖ్యమంత్రి ఉండటం వల్లే అన్నదాతలకు ఈ గోస వచ్చిందని మండిపడ్డారు. ముందుచూపు లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.