Farmers Protest: రేయింబవళ్లు.. రైతుల క్యూ!
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:02 AM
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. అయినా...
యూరియా కోసం తప్పని తిప్పలు
ఆగ్రహంలో రోడ్డెక్కుతున్న అన్నదాతలు
ధర్నాలు, రాస్తారోకోలు, బైఠాయింపులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. అయినా దొరక్కపోవడంతో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ కోయిల్‌కొండలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్‌లో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిల్చిపోయాయి. కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పంపిణీ కేంద్రానికి యూరియా లోడ్‌తో లారీ రాగా రైతులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ తరుణంలో పోలీసులు పోలీస్ స్టేషన్‌లో రైతులకు టోకెట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక చోట్ల రైతులు గంటల తరబడి బారులు తీరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాద, నాగాపూర్ గ్రామాల్లో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. కాగా, యూరియా దొరకకపోవడంతో పంట ఎండిపోతోందన్న మనస్తాపంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో శనివారం రైతు నర్సయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
రైతులను నేరస్తులుగా మార్చిన ప్రభుత్వం: హరీశ్
బస్తా యూరియా కోసం పొలాలు వదిలి పోలీసు స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితికి తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించారని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియాను కేంద్రం విడుదల చేసినా ఎందుకు కొరత ఏర్పడిందో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులే యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం ద్వారా కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు.
కొరతతో అల్లాడుతున్న రైతులు
నెల రోజులుగా రాష్ట్రంలో యూరియా సమస్య తీవ్రంగా ఉన్నదని, రైతులు యూరి యా కోసం అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొందని తెలంగాణ వికాస సమితి పేర్కొంది. తమ బృందం క్షేత్రస్థాయిలో చేసిన అధ్యయనం వివరాలను సమితి శనివారం విడుదల చేసింది. ఈ బృందం వర్గల్, గజ్వేల్, రాయపోల్, ములుగు మండలాల్లోని యూరియా విక్రయ కేంద్రాలు, గ్రామాల్లో రైతుల అభిప్రాయాలు ేసకరించింది.