Share News

kumaram bheem asifabad- యూరియా కోసం రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:12 PM

మండల కేంద్రంలో మంగళవారం యూరియా కోసం సిర్పూర్‌(యు)-జైనూర్‌ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రెండు బస్తాల యూరియా కోసం రెండు మూడు రోజులుగా ఇక్కడికి వస్తున్నామన్నారు.యూరియా మాత్రం తమకు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

kumaram bheem asifabad- యూరియా కోసం రైతుల రాస్తారోకో
సిర్పూర్‌(టి)లో ధర్నా చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు

సిర్పూర్‌(యు), సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం యూరియా కోసం సిర్పూర్‌(యు)-జైనూర్‌ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రెండు బస్తాల యూరియా కోసం రెండు మూడు రోజులుగా ఇక్కడికి వస్తున్నామన్నారు.యూరియా మాత్రం తమకు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రోజు మొత్తం వేచి చూసినా 60 యూరియా బస్తాలు మాత్రమే రైతులకు అందించారని చెప్పారు. వేలి ముద్రల యంత్రం సక్రమంగా పని చేయకపోవడంతో యూరియా పంపిణీలో అలస్యం జరుగుతుందని వ్యవసాయ అధికారులు చెప్పారు. దీంతో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఎస్సై రామకృష్ణ రైతులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి యూరియా పంపిణీకి ఏర్పాటు చేస్తామని ఎస్సై చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఎస్సై వ్యవసాయ అధికారులతో మాట్లాడడంతోపాటు జైనూర్‌ నుంచి వేలి ముద్రల యంత్రం తెప్పించి రైతులకు యూరియా పంపిణీ చేశారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బాలాజీ అనుకోడ రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టగా రైతులు ఉదయం నుండే బారులు తీరుతున్నారు. ముందుగా టోకెన్లు రాయించుకున్న ఒక్కో రైతుకు కేవలం రెండు యూరియా బస్తాలు పంపిణీ చేస్తుండడంపై రైతులు ఆందోళన చేపట్టారు. పోలీస్‌, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేపట్టారు. పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను అరగోస పెడుతుందని అన్నారు. రైతులు ఇంక ఎన్ని రోజులు యూరియా కోసం తిరగాలని ప్రశ్నించారు.

సిర్పూర్‌(టి) (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో మంగళవారం అధికారులు యూరియా పంపిణీ చేపట్టారు. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. యూరియా పంపిణీకి ఒకే కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు కౌంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌మండల అధ్యక్షులు అలంబీన్‌ ఆబ్దుల్లాతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో అదికారులు స్పందించి రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేశారు.

Updated Date - Sep 16 , 2025 | 11:12 PM