రాచకొండపై రైతుల ఆశలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:45 AM
ఎలాంటి సాగునీటి వనరులు లేని మునుగోడు నియోజకవర్గ రైతులు దేవుడిపై భారం వేసి పంటలు సాగు చేస్తున్నారు.
రాచకొండగుట్టల్లో రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రతిపాదన
శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ల ద్వారా రిజర్వాయర్లు నింపేందుకు ప్రణాళిక
ఎలాంటి సాగునీటి వనరులు లేని మునుగోడు నియోజకవర్గ రైతులు దేవుడిపై భారం వేసి పంటలు సాగు చేస్తున్నారు. కేవలం వర్షాధారంగానే వ్యవసా యం చేస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేకపోవడంతో చెరువులు కుంటలు ఎండిపోయాయి. భూగర్భజలాలు కూడా అడుగంటుతున్నాయి. బోర్లలో నీటిమట్టం తగ్గిపోతుండడంతో ఈ ప్రాంతంలో పంటల సాగు కూడా రోజురోజుకు తగ్గుతోంది. ప్రాజెక్టులు, సాగునీటి వనరులు లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారు.
- (ఆంధ్రజ్యోతి, చౌటుప్పల్)
మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యంగా సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు సాగునీటి శాశ్వత సమస్య పరిష్కారానికి రాచ కొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ విన్పిస్తోంది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో సాగు నీటికి శాశ్వత పరిష్కా రం లభిస్తుందని ప్రజాప్రతినిధులు, రైతులు అభిప్రాయపడు తున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాచకొండలో రిజర్వాయర్ల ఏర్పాటుకు సంబంధించి నీటిపా రుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించా రు. శివన్న గూడెం చర్లగూడెం వద్ద 12టీఎంసీల నేటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చర్లగూడెం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నుం చి 12 టీఎంసీల నీటి సామర్థ్యంతో రాచకొండలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.
పదేళ్ల కిందటే సర్వే
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రాచకొండగుట్టల్లో రిజర్వాయర్ ఏర్పాటు చేయడానికి పదేళ్ల క్రితమే సర్వే జరిగింది. ఈ ప్రాంత ప్రజల సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాచకొండలో రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. సంస్థాన్‌నారాయణపురం మండలం రాచకొండ లో ఒకటి, చౌటుప్పల్ మండలం దేవనమ్మ నాగారంలో మరో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాథమికంగా సుమారు 5వేల ఎకరాల భూమి అవసరముందని అం చనా వేశారు. రాచకొండ గుట్టలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి సమగ్ర నివేదిక ను రూపొందించే బాధ్యతను ప్రభుత్వం వ్యాప్‌కోస్ సంస్థకు అప్పగించింది. ప్రాజెక్టు సర్వే కోసం జీవో 496/2018 జారీచేసింది.అంతేకాకుండా డీఆర్‌పీ తయారీకి రూ.1.72కోట్లు మంజూరు చేసింది. నాలుగు నెలల్లో డీఆర్‌పీ తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆచరణలో అది అమలుకు నోచుకోలేదు.
మూడు నియోజకవర్గాలకు ప్రయోజనం
రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే నల్లగొండ, యాదాద్రిజిల్లాల్లోని మునుగోడు నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.ఈరిజర్వాయర్ ఏర్పాటు ద్వారా మునుగోడు నియోజకవర్గం లో ని 10చెరువులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 20 చెరువులు. మొత్తం 30 చెరువులతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని మరికొన్ని చెరువులకు సాగునీటిని అందించేలా కార్యాచరణ తయారు చేశారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చొరవ
ఎలాంటి సాగునీటి వనరులు లేక ఇబ్బందులు పడుతున్న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు సాగునీటి సౌకర్యాలు కల్పించేందు కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చొరవ చూపుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చించారు. కేవలం వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న ఇక్కడి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు రిజర్వాయర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్‌కు వివరించారు. ఇటీవల మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శాశ్వత పరిష్కారం లభించేనా?
ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు సాగు జలాలు లేక బీడు భూములుగా మారిన నారాయణపురం, చౌటుప్పల్ మండలాల రైతుల్లో రిజర్వాయర్ ఏర్పాటు అంశంపై ఆశలు చిగురిస్తున్నాయి. కొండలు ఎత్తైన గుట్టల మధ్యన ఉన్న రాచకొండలో రిజర్వాయర్లు నిర్మిస్తే ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి సాగు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఈ ప్రాంతం రైతులు, ప్రజలు భావిస్తున్నారు.
లిఫ్ట్ ద్వారా నీటి సరఫరా
రాచకొండ గుట్టల్లో నిర్మించతలపెట్టిన రిజర్వాయ ర్ నిర్మాణానికి చర్లగూడెం రిజర్వాయర్ నుంచి నాలు గు కిలోమీటర్ల దూరం గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్లు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 500మీటర్ల ఎత్తులో ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలం వాయలపల్లి పై భాగాన రిజర్వాయర్ నిర్మించవచ్చని నిపుణులు అం చనా వేస్తున్నారు. లిఫ్ట్ చేసిన నీటిని రోజుకు 0.10 టీఎంసీల చొప్పున 60 రోజులపాటు రాచకొండ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే అవకాశముంది. దీని ద్వారా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పల్లగట్టు తండా, మొలక చెరువు, చిల్లాపురంలోని పెద్ద చెరువు, నారాయణపురంలో మేళ్లచెరువు, జానకమ్మ చెరువు, కొత్తచెరువు, మహమ్మదాబాద్‌లోని చెరువులకు నీటిని నింపే అవకాశముంది.
చౌటుప్పల్ మండలంలోని నాగారం చెరువు, తంగడపల్లి చెరువు, మల్కాపురం చెరువు లాంటి చెరువులను నింపే అవకాశముంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల, బండనేమోరు, పటేల్ చెరువు, తాళ్లగూడెం, మంచాల, వనపర్తి. పోల్కంపల్లి, నోముల, లింగంపల్లి తదితర గ్రామాల్లోని చెరువులు నిండే అవకాశముంది. మహేశ్వరం నియోజకవర్గంలోని కర్తాల్, ముచ్చర్ల తదితర గ్రామాల్లో చెరువు కుంటలు నిండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.