Erratic Rains Damage Crops: అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ!
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:52 AM
ఈ వానాకాలం పంటల సాగు మొదలైనప్పటి నుంచి అన్నదాతలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి...
ఖరీ్‌ఫలో అతివృష్టి, అకాల వర్షాలతో ఆగమాగం.. సాధారణం కంటే 34 శాతం అధిక వర్షపాతం
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఈ వానాకాలం పంటల సాగు మొదలైనప్పటి నుంచి అన్నదాతలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి, ఇప్పుడు అకాల వర్షాలు... రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటి పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు కేంద్రాలు ఏర్పాటుచేయగా.. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులు తడిసిపోవటం, తేమ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావం కూడా రాష్ట్రంపై ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో ఏడాది సగటు వర్షపాతం 923.8 మి.మీ. అయితే... నైరుతి రుతుపవనాలతో(జూన్-సెప్టెంబరు వరకు) 740.6 మి.మీ, ఈశాన్య రుతుపవనాలతో 110.2 మి.మీ వర్షపాతం కురిస్తే లెక్క సరిపోతుంది. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో 1,109 మి.మీ వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం మొత్తం కలిపి 1,023 మి.మీ వర్షపాతం నమోదైతే.. ఈసారి ఐదు నెలల్లోనే 1,109 మి.మీ వర్షపాతం నమోదు కావటం గమనార్హం. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 34 శాతం అధికంగా నమోదైంది. అయితే వానాకాలం సీజన్ ప్రారంభ దశలో జూన్‌లో 20ు లోటు వర్షపాతం నమోదైంది. రైతులు విత్తనాలు వేయటానికి కూడా వెనకా ముం దూ ఆలోచించారు. జూలైలోనూ అంతంతమాత్రంగానే వర్షాలు పడ్డాయి. ఈ రెండు నెలలు కూడా రైతులు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడ్డారు. ఆగస్టు వచ్చేసరికి నైరుతి రుతుపవనాలు విజృంభించాయి. ఆ నెలలో 378.5 మి.మీ (75ు అధికం), సెప్టెంబరులో 267.7 మి.మీ (60ు అధికం) వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత అక్టోబరులో 120.4 మి.మీ వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో వర్షపాతం మరింత పెరిగింది.
తొలుత వర్షాభావం.. తర్వాత అతివృష్టి
వానాకాలం మొదలై 5 నెలలు అయ్యింది. జూన్, జూలై నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో వానలు దంచికొడుతున్నాయి. ఆవర్తన ద్రోణులు, అల్పపీడనాల ప్రభావంతో రెండు నెలలు కుండపోత వర్షాలు కురిశాయి. ఇప్పుడేమో మొంథా తుఫాన్ తోడైంది. రైతులకు, పంటలకు వానలు అవసరంలేని పరిస్థితుల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో 300 మి.మీ.కు మించి వర్షపాతం నమోదుకావటం గమనార్హం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 348.3 మి.మీ, నెక్కొండ మండలం రెడ్లవాడలో 301.8 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులకు ఏంచేయాలో తోచటంలేదు. వరదనీటి ప్రవాహానికి పంట ఉత్పత్తులు కొట్టుకపోతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన పల్కపల్లి అలీ అనే రైతు ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. దీపావళి రోజు మొక్కజొన్న కోతకోసి కంకులు ఆరబెట్టారు. తేమ తగ్గిన తర్వాత కొనుగోలు కేంద్రంలో అమ్ముదామనుకుంటే.. బుధవారం కురిసిన వర్షం, వరద తాకిడికి ఒక్క మొక్కజొన్న కంకి కూడా మిగలకుండా మొత్తం కొట్టుకుపోయాయి. దాదాపు 30 క్వింటాళ్ల మక్కలు నీటిపాలయ్యాయని అలీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయి. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందు వరద నీటిలో కొట్టుకపోతుంటే రైతులు నిస్సహాయులుగా చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
పంట నష్టంపై ప్రాథమిక నివేదిక
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించాలని, ప్రాథమిక నివేదిక తయారుచేసి డైరెక్టరేట్‌కు పంపించాలని బుధవారం క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. ఏఈవోలు, ఏఈవోలతోపాటు ఏడీఏలు కూడా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలని, పంట నష్టం అంచనా వేయాలని సూచించారు. వరద నీటి ప్రవాహం తగ్గిన తర్వాత పంటల పరిస్థితి ఏమిటి? తేలిన తర్వాత కోలుకుంటాయా? లేకపోతే పూర్తిగా నష్టపోయినట్లేనా? పంట నష్టం ఎంత శాతం జరిగింది? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
‘తేమ’తో సమస్యలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ఈ పంట ఉత్పత్తులను సేకరిస్తోంది. అయితే వరి కోతలు, పత్తి తీత, మొక్కజొన్న కోతలకు వర్షాలు అడ్డంకిగా మారాయి. వరి ధాన్యం 17 శాతానికి మించి తేమ ఉంటే కొనే పరిస్థితిలేదు. పత్తి 8 శాతం నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే పర్వాలేదు. అంతకుమించి ఉంటే సీసీఐ కొనడం లేదు. మొక్కజొన్న, సోయాబీన్ ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ సేకరిస్తోంది. మొక్కజొన్న 14 శాతం, సోయాబీన్ 12 శాతానికి మించి తేమ ఉంటే సెంటర్లలో కాంటా పెట్టడంలేదు. ఎండలు కాస్తే తేమ తగ్గేది. ఎండలు, పొడి వాతావరణం లేకపోగా... వర్షాలు కుండపోతగా పడుతుండటంతో తేమ శాతం విపరీతంగా పెరుగుతోంది. ఏ పంటను చూసినా 20 శాతానికి మించి తేమ ఉండటంతో కొనుగోళ్లు ఇబ్బందికరంగా మారాయి. ప్రైవేటు ట్రేడర్లు ఇదే అదనుగా భావించి ధరలు విపరీతంగా తగ్గించారు. పంట ఉత్పత్తులను సకాలంలో అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.