Triple R Alignment Dispute: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:57 AM
రీజనల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తా...
భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం
న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేద్దాం
నిర్వాసిత రైతుల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్‌నారాయణపురం, ఆమనగల్లు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. అవసరమైతే కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడతా. దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారాలంటే ముందు ఉత్తరభాగం అలైన్‌మెంట్ మారాలి. ఇవి మారకపోతే చివరికి ప్రభుత్వమే మారాలనేమో’ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అన్యా యం జరగనివ్వనని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో సంస్థాన్‌నారాయణపురం, గట్టుప్పల మండలాల రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో మునుగోడు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు నిర్వాసితులవుతున్నారన్నారు. ‘నాకు అన్యాయం జరిగినా సరే మునుగోడు ప్రజలకు, రైతులకు అన్యాయం జరగనివ్వను. మార్కెట్ ధర ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంతో మాట్లాడతా. అయినా న్యాయం జరగకపోతే అంతా రాజకీయాలకతీతంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేద్దాం’ అని చెప్పారు.
రంగారెడ్డిలో భూ నిర్వాసితుల నిరసనలు
ట్రిపుల్ ఆర్‌ను పాత అలైన్‌మెంట్ ప్రకారమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కేశంపేట మండలాల రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ట్రిపుల్ ఆర్‌పై ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రాథమిక నోటిఫికేషన్‌లోని తలకొండపల్లి మండలం గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి, రాంపూర్, వెంకట్రావ్‌పేట, జూలపల్లి గ్రామాల నిర్వాసితులు ఆదివారం ఆమనగల్లులోని మండల పరిషత్ వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజీవ్ చౌక్‌కు చేరుకొని హైదరాబాద్-శ్రీశైలం జాతీయరహదారిపై ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. అనంతరం ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేశారు.