Share News

నీళ్లు మళ్లించొద్దని రైతుల ఆందోళన

ABN , Publish Date - May 12 , 2025 | 12:36 AM

బ్రాహ్మణవెల్లంల ఉదయసముద్రం నీటిని తమ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు అక్రమంగా మళ్లించొద్దని చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేశారు.

నీళ్లు మళ్లించొద్దని రైతుల ఆందోళన
నేరడలో ఆందోళన చేస్తున్న రైతులు

నేరడకు వచ్చే నీటికి కాల్వ తవ్వారని ఆరోపణ

నీటిని అక్రమంగా తరలించడం తగదని హితువు

చిట్యాలరూరల్‌, మే 11(ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణవెల్లంల ఉదయసముద్రం నీటిని తమ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు అక్రమంగా మళ్లించొద్దని చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేశారు. ఉదయసముద్రం కాల్వ నుంచి నేరడకు వచ్చే నీటిని నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా కాల్వ తవ్వారని ఆరోపించారు. తమ గ్రామానికి వచ్చే నీటిని అక్రమంగా తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయసముద్రం కాల్వ కోసం తమ గ్రామ రైతులు వందల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని అయినా తాము మిన్నుకుండిపోయామన్నారు. సుమారు 700 మీటర్ల వరకు కాల్వ పనులు పూర్తయితే తమ గ్రామానికి పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవచ్చన్నారు.

అధికారితో వాగ్వాదం

గ్రామ శివారులో కాల్వ వద్దకు వచ్చిన ఉదయసముద్రం అధికారి డీఈ పిచ్చయ్య అక్కడికి రావడంతో రైతులు తమ పరిస్థితి ఏమిటని నీటిని అక్కమంగా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మీ గ్రామానికి నీటిని ఇవ్వబోమని అధికారి చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. కాల్వలు అక్రమంగా తవ్వితే ఇతరులకు ప్రశ్నించకుండా తమపై ఆగ్రహిస్తారా అని, సెలవు రోజు ఆదివారం రావడమేంటని నీటి గురించి అక్రమంగా తరలింపు గురించి అడిగితే తమను హేళన చేసి నీరు ఇవ్వకపోవడం ఏమిటని అధికారితో రైతులు వాగ్విదానికి దిగారు. కాల్వ నుంచి తమ గ్రామానికి వచ్చే నీటిని ఆపేయడమేంటని నేరడకు వచ్చే కాలువ ద్వారా నీటిని ఆపి అప్పజిపేటకు తరలించడం సరికాదన్నారు. నేరడకు వచ్చే ఉదయసముద్రం నీరు తమ గ్రామంలోని చెరువు నిండాక నీటిని ఇతర ప్రాంతానికి తరలించుకున్నా తమకు అభ్యంతరం లేదని చెరువు నిండముందే నీటిని మధ్యలోనే తరలించడమేటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తమకు తెలియకుండా మరో కాల్వలకు రైతులకు సమాచారమందించకుండా వారి భూముల నుంచి కాల్వలు తవ్వడం సరికాదన్నారు. ఉదయసముద్రం నీరు నేరడ గ్రామం చెరువు నిండాక ఏ గ్రామానికైనా మళ్లించుకోవాలని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. న్యాయం జరగాలని అందుకు ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను శాంతిపజేశారు.

Updated Date - May 12 , 2025 | 12:36 AM