యూరియా కోసం రైతుల ఆందోళన
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:36 PM
యూరియా కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ కేంద్రానికి 444 బస్తాలు రాగా సుమారు 1100 మంది రైతులు కేంద్రానికి చేరుకున్నారు.
కోటపల్లిలో యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులు
-కోటపల్లిలోరోడ్డుపై బైఠాయించిన రైతులు
-సిర్సాలో చెప్పుల వరుస
కోటపల్లి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : యూరియా కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ కేంద్రానికి 444 బస్తాలు రాగా సుమారు 1100 మంది రైతులు కేంద్రానికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో బస్తా పంపిణీ చేయగా మిగితా 660 మంది రైతులు తమకు యూరియా ఏదంటూ చెన్నూరు -కోటపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రహదారిపై బైఠాయించడంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి. దీంతోచెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్‌తోపాటు వ్యవసాయ శాఖ అధికారులు రైతులను సముదాయించి ఎట్టకేలకు గొడవను విరమింపజేశారు. రైతులను రైతువేదికలోకి తీసుకువెళ్లి మళ్లీ వచ్చే యూరియా కోసం ముందస్తుగా టోకెన్‌లు అందించారు. అలాగే మల్లంపేట గ్రామంలో 888 యూరియా బస్తాలు రాగా పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. సిర్సా గ్రామంలో 666 బస్తాలు రాగా సుమారు 1200 మంది రైతులు యూరియా పంపిణీ కేంద్రానికి వచ్చి గంటల కొద్ది నిరీక్షించారు. ఓ వైపు ఎండ ఉండడంతో ఏదులబంధం గ్రామానికి చెందిన దుర్గం లచ్చక్క అనే మహిళ స్ప్రహ తప్పి పడిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో రైతులు చెట్ల కిందకు చేరుకుని చెప్పుల వరుస పెట్టారు. ఇక్కడ సరిపడ యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కాగా వీరి బాధలు చూడలేక గ్రామానికి చెందిన ఏటం బాపు, రాజయ్య, యువ నాయకుడు హరీష్‌రెడ్డిలు రైతులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఉదయం నుంచే సిర్సాలో రైతు వేదికకు చేరుకున్న అన్నదాతలు నిరీక్షించారు. ఈ ఇబ్బందులు తొలగేదెప్పుడు, ఈ కష్టాలు ఇంకెన్నాళ్లు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.