Share News

Paddy Dues: యాసంగి సన్నాల బోనస్‌ ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:49 AM

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో... గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్‌ బకాయిల సంగతేంటి...

Paddy Dues: యాసంగి సన్నాల బోనస్‌ ఎప్పుడిస్తారో?

  • 4 నెలలుగా ధాన్యం రైతుల ఎదురుచూపులు

  • మొత్తం 23.36 లక్షల టన్నుల సన్నాల కొనుగోళ్లు

  • వీటికి సంబంధించి రూ.1,168 కోట్ల బకాయిలు

  • తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

  • రెండు సీజన్లవి కలిపి ఇస్తారా? వేర్వేరుగా ఇస్తారా? అని ప్రశ్న

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో... గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్‌ బకాయిల సంగతేంటి? అనేది రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. 4 నెలలుగా సన్నాల బోనస్‌ కోసం రైతులు ఎదురు చూస్తుండగా... ఆర్థిక శాఖ నుంచి ఇంకా నిధులు విడుదల కావడంలేదు. మరోవైపు.. మళ్లీ ఖరీఫ్‌ కొనుగోళ్ల సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండు సీజన్ల బోనస్‌ డబ్బులు ఒకేసారి చెల్లిస్తారా? ముందు పాత బకాయిలు చెల్లిస్తారా? లేకపోతే యాసంగి బకాయిలు అలాగే ఉంచి... ప్రస్తుత వానాకాలం బోనస్‌ చెల్లిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత (2024- 25) యాసంగి సీజన్‌కు మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 74.40 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. సేకరించిన ధాన్యంలో దొడ్డు రకాలు 51.04 లక్షల టన్నులు కాగా, సన్న రకాలు 23.36 లక్షల టన్నులు ఉన్నాయి. దొడ్డు, సన్న రకాలకు కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) ప్రకారం అప్పుడే చెల్లింపులు పూర్తి చేశారు. అయితే, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ మాత్రం చెల్లించలేదు. ఇందుకు సంబంధించి మొత్తం రూ. 1,168 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. నాలుగైదు రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేస్తుంది. అయితే, బోనస్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఓపీఎమ్మెస్‌ (ఆన్‌లైన్‌ ప్రొక్యూర్మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) చెల్లించడానికి అవకాశం లేదు. ఈక్రమంలోనే ఎమ్మెస్పీ చెల్లింపులు, బోనస్‌ చెల్లింపులు వేర్వేరుగా జరుగుతున్నాయి. బోనస్‌ చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈలోగా ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభం కావడంతో పాత బకాయిల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 04:49 AM