Farmers Attempt Suicide: కడియం సమక్షంలో రైతుల ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:43 AM
తీవ్ర వరదలకు ధ్వంసమైన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అక్కడ రైతుల గుండెకోత కళ్లకు కట్టింది....
పురుగుల మందు తాగేందుకు యత్నించిన ముగ్గురు.. అడ్డుకున్న పోలీసులు వరంగల్ జిల్లా ధర్మసాగర్‌లో ఘటన
ఇరిగేషన్ అధికారుల తీరు వల్లే నష్టపోయామంటూ రైతుల ఆవేదన
ధర్మసాగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వరదలకు ధ్వంసమైన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అక్కడ రైతుల గుండెకోత కళ్లకు కట్టింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన వరి పొలాలను, ధ్వంసమైన దేవునూర్ బ్రిడ్జి, రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా.. ఇరిగేషన్ అధికారుల తీరుతోనే చేతికొచ్చిన దశలో పంటలు నీటమునిగాయని, ఫలితంగా పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేవునూర్ గ్రామానికి చెందిన రైతులు నార్లగిరి సమ్మయ్య, చిట్టె రవి పురుగుల ముందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లోంచి పురుగుల మందు డాబ్బాలను లాక్కుని సర్దిచెప్పడంతో ఆ రైతులు శాంతించారు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు మోరే మహేందర్ తాను మూడెకరాల్లో సాగుచేసిన వరిపంట పూర్తిగా పనికిరాకుండా పోయిందంటూ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ వర్షం వల్ల రైతులు నష్టపోతే వారి అదృష్టం బాగోలేదని అనుకోవొచ్చు.. కానీ దేవాదుల ప్రాజెక్టు గేట్లు తెరవడం వల్ల రైతుల పంటలు మునిగిపోయాయని.. దీనికి పరిహారం ఎవరు చెల్లించాలని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. దేవాదుల వరద వల్ల ఽరైతుల పంటలు నష్టపోకుండా ఉండాలంటే వాగును వెడల్పు చేయాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి హద్దులను గుర్తిస్తే ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి పనులను చేపట్టాలని ఆదేశించారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు. దేవునూర్ బ్రిడ్జి మరమ్మతు, రోడ్డు పనులను 15 రోజుల్లో పూర్తిచేసి నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు.