kumaram bheem asifabad- రైతుల వెతలు పట్టడం లేదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:15 PM
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి వెతలు పట్టడం లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని బుధవారం సందర్శించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
బెజ్జూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి వెతలు పట్టడం లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని బుధవారం సందర్శించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతుల అవస్థలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి 50 సార్లు వెళ్లారని, కనీసం 50 బస్తాల యూరియా కూడా తీసుకు రాలేక పోయారని ఆరోపించారు. ఢిల్లీ మీద ఉన్న ప్రేమ రైతులపై లేదా అని ప్రశ్నించారు. బుధవారం ముఖ్యమంత్రి వరంగల్ డిక్లరేషన్‌లో రైతు రాజ్యాంగా ప్రకటించారని, యూరియా దొరకక రైతులు సతమతమవుతుంటే ఏ మాత్రం పట్టించుకో కుండా ఉండడమేనా రైతు రాజ్యం అంటే అని ప్రశ్నించారు. 260 రూపాయలు ఉన్న యూరియాను దళారులు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నా పట్టింపు లేదన్నారు. డీసీఎంఎస్ ద్వారా పంపిణీ చేస్తున్నారని దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విడ్లూరమని చెప్పారు. . స్థానిక ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో పోరాడీ యూరియా తెప్పించలేక పోతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభు త్వంతో పోరాడి యూరియా తీసుకు రావాలని కదా ఎందుకు తేలేక పోతున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సారయ్య, ఖాజామోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కేసు విచారణలో జాప్యం చేస్తే ఊరుకోం
- బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
పెంచికలపేట, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఫర్టిలైజర్ దుకాణం యజమాని రాచకొండ కృష్ణ అనే వ్యక్తి వేధింపుల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్ కేసులో జాప్యం చేస్తే ఊరుకోమని డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆగర్‌గూడ గ్రామంలో బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి మరణించి సుమారు నెల రోజులు అవుతున్నా కేసులో పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చాడని, సాక్షులను బెదిరింపులకు గురి చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని, ఇప్పటి వరకు సాక్షుల వాంగ్మూలం సేకరించలేదని ఆరోపించారు. కేసులో కీలకమైన ఆధారాలు, సాక్షులు, రాజశేఖర్ మరణ వాంగ్మూలం ఉన్నా కేసులో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు షరీఫ్, బాలాజీ, దేవాజీ, నవీజ్, అనూప్ పాల్గొన్నారు.