kumaram bheem asifabad-మొంథా ధాటికి రైతులు విలవిల
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:08 PM
మొంథా తుఫాన్ జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో ఎక్కవ శాతం రైతులు పత్తి, వరి పంట సాగు చేస్తున్నారు. మూ డు రోజులుగా కురిసిన వర్షాలు, గాలుల తీవ్రతకు వరి నేలవాలింది. పత్తి తడిసిపోవడంతో రంగు మారిం ది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- 50 శాతం మేర దిగుబడులు తగ్గే అవకాశం
- ముసురు, అధిక వర్షంతో తడిసిముద్దవుతున్న పత్తి
- నల్లగా మారిన పింజ, మొలకలు వస్తున్న కాయలు
- ఆందోళనలో అన్నదాతలు
మొంథా తుఫాన్ జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో ఎక్కవ శాతం రైతులు పత్తి, వరి పంట సాగు చేస్తున్నారు. మూ డు రోజులుగా కురిసిన వర్షాలు, గాలుల తీవ్రతకు వరి నేలవాలింది. పత్తి తడిసిపోవడంతో రంగు మారిం ది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చింతలమానేపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంఽథా తుఫాన్ రైతులను ఆగమాగం చేసింది. జిల్లాలో పంటలు చేతికొచ్చే సమయంలో మూడు రోజుల పాటు తుఫాన్ ప్రభావంతో వరుస వర్షాలు, గాలుల ప్రభావంతో వరి, పత్తి పంటలు నేలపాల య్యాయి. వరి కోతకు వచ్చిన సమయంలో గాలి వాన విజృంభించడంతో పైర్లు నేలవాలి, గింజలు నేల వాలడమే కాక పంటలు నీట మునిగాయి. పత్తి, వరి పంటల పరిస్థితి మరింత దయనీయం గా మారింది. సీజన్ ఆరంభంలో వర్షాలు లేక ఎదు గుదల లేక పోవడంతో, రైతులకు పెట్టుబడులు పెరిగాయి. ఆ తర్వాత వర్షాలు కురిసినా, ఆశించిన స్థాయిలో పైర్లు ఎదగలేక దిగుబడులు తగ్గాయి. తాజాగా పండిన కొద్దీ పత్తి తీత దశలో తుఫాన్ నిండా ముంచింది. పత్తి పూర్తిగా తడిసిముద్దవడం తో భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
- 4.6 లక్షల ఎకరాల్లో పంటలు..
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 4.6 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులో పత్తి పంట 3.5 లక్షల ఎకరాలు, వరి పంట 58వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే పంట పరిహారం అంచనా వేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గాలితో కూడిన వాన కావడంతో వరి పైర్లు ఎక్కడికక్కడ నేలవాలి కంకులు నీళ్లల్లో మునిగి నానాయి. దీంతో సగం మేర దిగుబడి కోల్పోతున్నామని, మిగిలిన పంట కోతకు సైతం రెట్టింపు వ్యయం అవుతుందని రైతులు వాపో తున్నారు. 40 బస్తాల దిగుబడి వచ్చే చోట ఎకరాకు 20 బస్తాలకు మించి దిగుబడి రాదని, పైగా వరి కోత యంత్రాలకు రెట్టింపు ఖర్చు అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాక గింజలు కూడా రంగు మారడంతో మద్దతు ధర దక్కదని, ఈ పరిస్థితుల్లో సగానికి పైగా నష్టపోవాల్సి వస్తుందని, దీన్ని దృష్టిలో ఉం చుకొని ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
- పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణం..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వగా, సీజన్ ఆరంభం నుంచే పత్తి రైతులను ఈ సారి కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. సీజన్ ఆరంభంలో వర్షాలు లేక పంట ఎదుగుదల లోపించగా, పెట్టుబడులు పెరిగిపోయాయి. తీరా వరిలో కురిసిన వర్షాలతో తక్కువ దిగుబడైనా వస్తుందని అనుకున్న సమ యంలో మొంథా తుఫాన్ పత్తి రైతులను చిత్తు చేసింది. పత్తి తీత దశలో నాలుగు రోజులుగా గాలితో కూడిన వర్షాలు కురుస్తుండడం, ముసురు పట్టడంతో పూర్తిగా తడిసింది. సగానికి పైగా పత్తి తీతకు సైతం పనికి రాకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని భావించగా, వర్షంతో ఆ ఆశలు కూడా నీరు గారి, నిండా మునిగారు. ఎకరాకు కనీసం రూ. 20వేల వరకు నష్టపోయినట్టేనని పత్తి రైతులు వాపోతున్నారు. నాణ్యత లేదనే సాకుతో సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయకపోతే మద్దతు ధర రూ. 8110 కు బదులు రూ. 5,500 మించి విక్రయిం చలేమని అయినా కొనుగోలు చేసే నాథుడే ఉండడని అప్పుల పాలయినట్లేనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, ధాన్యం కొనుగోలు చేసిన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లలో అండగా నిలొలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వరి పంట నేలవాలింది..
- టొంబ్రె శ్రీనివాస్, రైతు, చింతలమానేపల్లి
వరి పైరు పూర్తిగా నేలవాలింది. ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. పైౖరు గింజ పోసుకొని కోతకు వచ్చింది. ఇప్పటికే లక్షన్నరపైనే ఖర్చు చేశాను. 40 బస్తాల వరకు ఎకరాకు దిగుబడి వస్తుందని అనుకున్నా 20 బస్తాల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. పత్తి పంటది కూడా ఇదే పరిస్థితి. పెట్టుబడులకు వడ్డీలు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులకు ఎకరా చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలి.
వర్షంతో నిండా మునిగాం..
- చౌదరి సంతోష్, రైతు, కర్జెల్లి
అకాల వర్షంతో నిండా మునిగాం. నాలుగు ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. ఎకరాకు 25వేల రూపాయల పైనే పెట్టు బడి పెట్టాను. పంటలు తీరా చేతికి వచ్చే దశలో అకాల వర్షంతో నిండా మునిగిపోయాయి. పత్తి పూర్తిగా రంగు మారింది. కాయలు నల్లబడ్డాయి. గూడలు మురిగిపోతున్నాయి. 25శాతం పంటలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేయాలి.