Share News

Native Chickens on Road in Elkaturthi: ఊరంతా నాటుకోడి కూరే

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:33 AM

నాటుకోడి! ఫారమ్‌కోడి కన్నా రుచి.. పోషకాలూ మెండు! ధరా ఎక్కువే!! ఇలాంటి నాటుకోళ్లు పదో, ఇరవయ్యో కాదు....

Native Chickens on Road in Elkaturthi: ఊరంతా నాటుకోడి కూరే

  • 2వేల నాటు కోళ్లను వ్యానులో తెచ్చి రోడ్డుపై వదిలేసిన ఓ పెంపకందారుడు

  • ఎగబడి దొరికినన్ని పట్టుకుపోయిన జనం

  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన

  • పెంపకందారుడు ఎందుకు వదిలేసినట్లు?

ఎల్కతుర్తి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నాటుకోడి! ఫారమ్‌కోడి కన్నా రుచి.. పోషకాలూ మెండు! ధరా ఎక్కువే!! ఇలాంటి నాటుకోళ్లు పదో, ఇరవయ్యో కాదు.. ఏకంగా ఓ రెండువేల కోళ్లను రాత్రిపూట వ్యానులో తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడో గుర్తుతెలియని పెంపకందారుడు! హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ముల్కనూర్‌ వెళ్లే రహదారిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. శనివారం ఉదయం చేలు, చెలకల్లో కోళ్లు కనిపించడంతో ఎల్కతుర్తి, ఇందిరానగర్‌ గ్రామస్థులు, ఆ దారి వెంట వచ్చీపోయే జనం వాటిని పట్టుకునేందుకు పోటీపడ్డారు. చేలు, పొదల్లోకి పరుగులు తీస్తూ దొరికినన్ని కోళ్లను చంకల్లో పెట్టుకొని.. చేతుల్లో, సంచీల్లో పట్టుకొని వెళ్లిపోయారు. ఫలితంగా శనివారం ఆ చుట్టుపక్కల ఊళ్లలో కోడికూర వాసన గుప్పుమంది. ఆ నాటుకోళ్ల సైజు కాస్త చిన్నగా ఉన్నా కండపుష్టితో నిగనిగలాడుతూ పైకి ఆరోగ్యంగానే కనిపించాయి. మరి.. ఎందు కలా వదిలేసినట్లు? అనే అనుమానాలూ జనాలకు వచ్చాయి. పక్కాగా ఆ కుక్కటాలకు ఏదైనా వైరస్‌ సోకి ఉండే ఉంటుంద నే వదంతులూ వ్యా పించాయి. ఎల్కతుర్తి ఎస్సై అకినేపల్లి ప్రవీణ్‌కుమార్‌ కొన్ని కోళ్లను ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల్లో ఆ కోళ్లకు ఎలాంటి వైరస్‌ సోకలేదని వైద్యులు నిర్ధారించారు. కోళ్లలో ఎదుగుదల లేకపోవడం, వాటికి దాణా వేసే స్థోమత లేక వదిలేసి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కోడిని రూ.50 చొప్పున అమ్మినా మస్తు పైసలొచ్చేవికదా? ఎందుకిలా చేసి ఉంటాడు ఆ పెంపకందారుడు?అని జనాలు చర్చించుకుంటున్నారు. అన్నట్టు.. శనివారం సాయంత్రం వరకు కూడా ముల్కనూరు సమీపంలోని చేలల్లో కొన్ని కోళ్లు కనిపించాయి.

Updated Date - Nov 09 , 2025 | 02:33 AM