Farmer Leaves Onion Crop: పెట్టుబడి 2 లక్షలు.. ఆదాయం 21 వేలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:51 AM
తల్లి వంటి ఉల్లి పంటను ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే.. గిట్టుబాటు ధర లేక పంట పొలంలోనే ప్రజలకొదిలేసిన దీన రైతు గాథ జోగుళాంబ..
గిట్టుబాటు కాని ఉల్లి సాగు.. ప్రజలకొదిలేసిన రైతు
రాజోలి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తల్లి వంటి ఉల్లి పంటను ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే.. గిట్టుబాటు ధర లేక పంట పొలంలోనే ప్రజలకొదిలేసిన దీన రైతు గాథ జోగుళాంబ-గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. రాజోలి గ్రామ రైతు శేఖర్.. రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని.. రూ.2 లక్షల పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేశాడు 70 క్వింటాళ్ల దిగుబడితో లాభం వస్తుందనుకున్న శేఖర్ ఆశ అడియాసగా మిగిలింది. మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.300 పలుకుతోంది. దీని ప్రకారం మొత్తం అమ్మినా రూ.21 వేల రాబడి రాదు. దీనికి తోడు ఉల్లిగడ్డలను తవ్వి, కోయడానికి కూలీల ఖర్చు, మార్కెట్‌కు రవాణా ఖర్చు అదనం. దీంతో కూలీలను ఏర్పాటు చేయలేక.. పంట అమ్ముకుని నష్టాల పాలు కాలేక పొలంలోనే వదిలేసుకున్నాడు. అంతటితో ఆగక.. తన పొలంలో ఉల్లిగడ్డలున్నాయని, కావాల్సిన వారు ఉచితంగా తీసుకెళ్లొచ్చని రాజోలి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చెప్పాడు. దీంతో ప్రజలు, స్థానిక వ్యాపారులు సంచులతో పొలంలోకి ఎగబడ్డారు. కొందరు 2,3 సంచుల్లో ఉల్లి గడ్డలు నింపుకుని సంతోషంగా వెళ్లారు. మరి కొందరు మోటారు సైకిళ్లు, ఆటోల్లో తరలించుకుని వెళితే.. ఒక కూరగాయల వ్యాపారి ఏకంగా ట్రాక్టర్ లోడ్ తీసుకెళ్లడం గ్రామంలో చర్చనీయాంశమైంది. తన పంట వృథా కాకూడదని, ఉచితంగా ప్రజలను తీసుకెళ్లాలని చెప్పిన రైతు శేఖర్ మనస్సు ఎంతో గొప్పదని గ్రామస్తులు అభిప్రాయ పడ్డారు. గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.